ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం .. హైకోర్టు లో పిటిషన్ !

Update: 2021-07-09 14:30 GMT
ఏపీ లో పాఠశాలల పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక  ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే విద్యార్థులకు ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌ లైన్ క్లాసులు నిర్వహిస్తామని వెల్లడించారు.  10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయిస్తామని అన్నారు. ఈ నెలాఖరులోపు మార్కుల మెమోలను జారీ చేస్తామని తెలిపారు.స్కూళ్లలో మంచి విద్యను అందించేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కొత్త విద్యావిధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ విధానంతో ఏ ఒక్క ఉపాధ్యాయుడి పోస్టూ తక్కువ కాదని.. ఏ బడీ మూతపడదని తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు టీచర్లకు వర్క్ బుక్స్ పై శిక్షణనిస్తామన్నారు.

అయితే, ఇదిలా ఉంటే ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. రాష్ట్రంలో ఉన్న అందరు టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాతనే స్కూల్స్ ఓపెన్ చేయాలని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనితో దీనిపై ప్రభుత్వం తన స్పందనను తెలియజేస్తూ .. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపుగా 60 శాతం టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్టు కోర్టు కి తెలిపింది. మిగిలిన వారికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తునట్టు ప్రభుత్వం కోర్టుకి తెలియజేసింది. దీనితో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈ కేసు లో  తర్వాత విచారణను ఆగస్టు 11 కి వాయిదా వేసింది.
Tags:    

Similar News