అవుట‌ర్ చరిత్రలోనే ఇది పెద్ద ప్రమాదం!

Update: 2016-08-31 08:02 GMT
కొన్ని ప్ర‌యాణాలు గ‌మ్యాన్ని చేరుకోవు! ప్ర‌యాణికుల జీవితాల‌ను చివ‌రి మ‌జిలీకి చేర్చేస్తాయి! అలాంటి, ఓ విషాధ‌క‌ర‌మైన ప్ర‌యాణం ఇది. స్నేహితురాలి పెళ్లి విందుకు వెళ్లాల‌ని 9 మంది కుర్రాళ్లు బ‌య‌లుదేరారు. అంద‌రూ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన‌వారే. ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ విందులో ఆడిపాడాల‌నీ, త‌మ స్నేహితురాలికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయాలని ఒక వాహ‌నంలో బ‌య‌లుదేరారు. పాట‌లు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ జాలీగా ప్ర‌యాణం ప్రారంభించారు. అంత‌వ‌ర‌కూ న‌వ్వుతూ హాయిగా సాగిన వారి ప్ర‌యాణం అక్క‌డితో ఆగిపోతుంద‌ని వారు కూడా ఊహించ‌లేక‌పోయారు!

అవుట‌ర్ రింగ్ రోడ్డుమీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక టోల్ గేటు వ‌ద్ద‌కు ఈ వాహ‌నం చేరుకుంది. అప్ప‌టికే ముందు ఒక లారీ నిల‌బ‌డి ఉంది. దాని వెన‌క నెమ్మ‌దిగా ఈ వాహ‌నాన్ని పోనిస్తున్నారు. త‌మ వంతు రాగానే టోల్ ఫీజు క‌ట్టేందుకు డ‌బ్బులు కూడా చేత్తో ప‌ట్టుకున్నాడు డ్రైవింగ్ చేస్తున్న కుర్రాడు. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో మృత్యుశ‌క‌టం... ఒక డీసీఎం వ్యాను అత్యంత వేగంగా వ‌చ్చి వీరి వాహ‌నం వెన‌క భాగాన్ని బ‌లంగా ఢీ కొట్టింది. అంతే, ఆ త‌రువాత ఏం జ‌రిగిందో వారిలో ఎవ్వ‌రికీ తెలీదు! వాహ‌నం ముందుకు ఉరికి, ముందున్న లారీని ఢీ కొట్టింది. అప్ప‌టికీ డీసీఎం నియంత్ర‌ణ కాలేదు. దాంతో రెండు వాహ‌నాల మ‌ధ్య న‌లిగి నుజ్జునుజ్జ‌యింది. మెద‌క్ జిల్లా స‌దాశివపేట నుంచి పెళ్లి విందుకు వెళ్తున్న తొమ్మిదిమంది కుర్రాళ్ల‌లో 8 మంది ఛిద్ర‌మైపోయారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి వేళ... రంగారెడ్డి జిల్లా మేడ్చ‌ల్ మండ‌ల ప‌రిధిలోని సుతారిగూడ వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఇమ్రాన్‌ (23) - అఖిల్ (23) - షకావత (30) - ఫిరోజ్ (23) - ఇర్ఫాన్ (23) - మహ్మద్‌ అక్బర్‌ - మహ్మద్‌ నిషాద్‌... ఈ యువ‌కులంతా అక్క‌డికి అక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అబ్బాస్‌కు తీవ్రంగా గాయాల‌య్యాయి. హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న కొంప‌ల్లిలో జ‌రుగుతున్న ఓ పెళ్లి విందుకు వీరంతా బ‌య‌లుదేరారు. ఈ తొమ్మిది మంది స్నేహితులూ షెకావ‌త‌కు చెందిన ట‌వేరాలో వెళ్లారు. ట‌వేరాను అత‌డే డ్రైవింగ్ చేశాడు. సుతారిగూడ స‌మీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్ ద‌గ్గ‌ర ఆగిన ఈ టేవారాను, ఒక డీసీఎం వాహ‌నం ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం అబ్బాస్ ఒక్క‌డే గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అత‌డిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌తా వారంతా అక్క‌డికి అక్క‌డే ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రం. ఈ టోల్ గేట్ వ‌ద్ద స్పీడ్ బ్రేక‌ర్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదానికి కార‌ణంగా చెబుతున్నారు. ఏదేమైనా, ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న ఎనిమిది మంది కుర్రాళ్ల జీవితం ఇలా అర్ధంత‌రంగా అనంత‌వాయువుల్లో క‌లిసిపోయింది. అవుట‌ర్ రింగ్ రోడ్డు చ‌రిత్ర‌లోనే అత్యంత విషాధ‌క‌రం ఇది! మితిమీరిన వేగం వీరి ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది.
Tags:    

Similar News