ఏక్ నాథ్ కు ఎంఎల్ఏలు షాకిస్తున్నారా ?

Update: 2022-06-25 05:30 GMT
మహారాష్ట్రలోని శివసేన పార్టీలో మొదలైన సంక్షోభం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గం మరోవైపు తిరుగుబాటు నేత, మంత్రి ఏకనాథ్ వర్గం మధ్య గ్రూపు రాజకీయాలు గంట గంటకు మారిపోతోంది. రెండు వర్గాల మధ్య సమీకరణలు మారిపోతుండటంతో అసలు మెజారిటి ఎంఎల్ఏలు ఎవరివైపున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

శుక్రవారం ఉదయం వరకు ఏక్ నాధ్ వర్గంలో 47 మంది ఎంఎల్ఏలున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. తిరుగుబాటు నేత వర్గంలో ఉన్న ఎంఎల్ఏల తరపున ఒక వినతిపత్రం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరికి చేరింది. దాన్ని చూసిన తర్వాత అందులో చాలా సంతకాలు ఫోర్జరీవే అని నరహరి ప్రకటించటం సంచలనంగా మారింది. దాంతో ఏక్ నాథ్ దగ్గరున్న వారిలో నిజమైన ఎంఎల్ఏలు ఎంతమంది అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

ఇదే సమయంలో ఇద్దరు ఎంఎల్ఏలు తిరుగుబాటు శిబిరంలో నుండి థాక్రే శిబిరంలోకి మారిపోయారు. కైలాష్ పాటిల్ మాట్లాడుతూ తనకు ఏక్ నాథ్ ఫోన్ చేసి డిన్నర్ కు రమ్మంటే హోటల్ కు వెళ్ళినట్లు చెప్పారు.

అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత ఎంఎల్ఏలందరినీ ఏక్ నాథ్ సూరత్ కు తరలించినట్లు చెప్పారు. సూరత్ కు తరలిస్తున్నట్లు కానీ తిరుగుబాటు చేస్తున్నట్లు కానీ తనకు మాట మాత్రం కూడా చెప్పలేదన్నారు. దాంతో మధ్యలోనే కారు దిగి మళ్ళీ ముంబాయ్ చేరుకుని థాక్రేని కలిశానన్నారు.

రెండు రోజుల క్రితం నితిన్ దేశ్ ముఖ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసిన విషయం తెలిసిందే. థాక్రేపై తిరుగుబాటు చేస్తున్నట్లు చాలామంది ఎంఎల్ఏలకు అసలు తెలీదన్నారు.

డిన్నర్ కు రమ్మని పిలిపించి భోజనం అయిపోయిన వెంటనే అందరినీ వాహనాల్లో ఎక్కించుకుని ఏక్ నాథ్ ముందు సూరత్ తర్వాత గువహతికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. దాంతో ఏక్ నాథ్ వర్గంగా ప్రచారంలో ఉన్న ఎంఎల్ఏల్లో చాలామందిని ఏక్ నాథ్ మాయచేసి తనతో తీసుకెళ్ళినట్లు అర్ధమవుతోంది. మొత్తానికి ఎంఎల్ఏలపై అనర్హత పిటీషన్ దెబ్బ బాగానే పనిచేసినట్లే అనిపిస్తోంది.
Tags:    

Similar News