మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ముందుకు ఏక‌నాథ్ షిండే!

Update: 2022-06-30 06:20 GMT
గ‌త ప‌ది రోజులుగా మ‌లుపుల మీద మలుపులు తిరిగిన మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఉద్ధ‌వ్ స‌ర్కార్ కూలిపోవ‌డానికి కార‌ణ‌మైన శివ‌సేన రెబల్ నేత ఏక‌నాథ్ షిండే మ‌రికొద్దిసేప‌టిలో గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీని క‌లుస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏక‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు, 8 మంది స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు గోవాలో ఉన్నారు. ప్ర‌త్యేక విమానంలో అక్క‌డి నుంచి జూన్ 30 మ‌ధ్యాహ్నానికి ముంబై చేరుకుంటార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత ఏక‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబ‌ల్ ఎమ్మెల్యేలు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తును బీజేపీకి అందిస్తున్న‌ట్టు లేఖ ఇస్తార‌ని తాజా స‌మాచారం.

అలాగే ఏక‌నాథ్ షిండే ముంబై చేరుకున్నాక మీడియాతోనూ మాట్లాడ‌తార‌ని తెలుస్తోంది. త‌మ తిరుగుబాటు ఉద్ధ‌వ్ ఠాక్రే మీద కానీ చెప్పనున్నార‌ని అంటున్నారు. శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్, ఎన్సీపీ నేత, ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న అజిత్ ప‌వార్ ల వ‌ల్లే తాము తిరుగుబాటు చేయాల్సి వ‌చ్చింద‌ని ఏకనాథ్ చెబుతార‌ని తెలుస్తోంది.

అక్క‌డికీ తాము ఉద్ధ‌వ్ ను ఎన్సీపీ, కాంగ్రెస్ ను వ‌దిలిపెట్టాల‌ని కోరామ‌ని.. బీజేపీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని విన్న‌వించామ‌ని ఏక‌నాథ్ షిండే గుర్తు చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. త‌న‌తో స‌హా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బీజేపీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరినా ఉద్ధ‌వ్ ఠాక్రే ప‌ట్టించుకోలేద‌ని మీడియాకు చెబుతార‌ని అంటున్నారు.

మొత్తం వివాదానికి కార‌ణం.. శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌతేన‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ఆరోపిస్తున్నారు. వివాదాన్ని పెంచేలా వ్యాఖ్య‌లు చేయ‌డం, త‌మ ఇళ్లు, కుటుంబ స‌భ్యుల‌పై సంజ‌య్ రౌత్ దాడుల‌కు పిలుపు ఇచ్చార‌ని మండిప‌డుతున్నారు. పైగా ముంబై ఎలా వ‌స్తారో చూస్తామ‌ని.. చంపి పారేస్తామ‌ని బెదిరింపుల‌కు సైతం సంజ‌య్ పాల్ప‌డ్డాడ‌ని అంటున్నారు. ఎంత జ‌రిగినా ఉద్ధ‌వ్ సంజ‌య్ రౌత్ ని వారించ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏక‌నాథ్ షిండే మీడియాతో ముచ్చ‌టించి త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను వివ‌రిస్తార‌ని అంటున్నారు. త‌నకు మ‌ద్ద‌తు ఇస్తున్న ఎమ్మెల్యేల వివ‌రాలు, ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చిందో అనే విష‌యాన్ని మీడియాకు వివ‌రిస్తార‌ని చెబుతున్నారు.

కాగా శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తార‌ని తేలిపోతున్న నేప‌థ్యంలో ఏక‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి, ఆయ‌న వ‌ర్గం ఎమ్మెల్యేల్లో 11 మందికి కేబినెట్ మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఉద్ద‌వ్ రాజీనామా చేయ‌డంతో జూన్ 30న నిర్వ‌హించాల్సిన బ‌ల ప‌రీక్ష ర‌ద్ద‌యిన‌ట్టు శాస‌న‌స‌భ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అలాగే శాస‌న‌స‌భ ప్ర‌త్యేక స‌మావేశం సైతం ర‌ద్ద‌యింద‌ని వెల్ల‌డించింది.
Tags:    

Similar News