కౌంటింగ్ తో కోడ్ పూర్తి కాద‌ట‌.. ఎప్ప‌టివ‌ర‌కంటే?

Update: 2019-05-22 05:16 GMT
ఎన్నిక‌లకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నాటి నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌టం తెలిసిందే. నాటి నుంచి పోలింగ్ పూర్తై.. ఫ‌లితాలు వెల్ల‌డైన వెంట‌నే కోడ్ ముగిసిన‌ట్లేన‌ని ప‌లువురు భావిస్తుంటారు. అలాంటి ఆలోచ‌న‌లో ఉంటే వెంట‌నే క‌రెక్ట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. ఓట్ల లెక్కింపుతోనే పోలింగ్ కోడ్ పూర్తి కాద‌ని ఎన్నిక‌ల అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపు వేళ‌.. అనుకోని ప‌రిణామం చోటు చేసుకున్నా.. ఈవీఎంలు మొరాయించినా.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రీపోలింగ్ నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని.. అందుకే కోడ్ కంటిన్యూ అవుతుంద‌ని పేర్కొన్నారు. ఏదైనా పోలింగ్ బూత్ లోని ఈవీఎం డీ కోడ్ కాకున్నా.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ ప‌క్షంలో రీపోలింగ్ కు అవ‌కాశం ఉంటుంద‌ని ఏపీ రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్ప‌ష్టం చేశారు.

స‌మ‌స్య‌లు ఏమొచ్చినా.. వివాదాల్లేకుండా ఉండేందుకు రీపోలింగ్ నిర్వ‌హించ‌టానికి అవకాశం ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఎన్నిక‌ల కోడ్ మే 27 వ‌ర‌కు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత ఊరేగింపులు.. ఉత్స‌వాలు.. బాణ‌సంచా పేల్చ‌టం లాంటివేమీ చేయ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News