ఇవాళ చీర‌లు.. రేపు చెక్కుల‌కే అదే లెక్కా?

Update: 2018-10-04 05:03 GMT
కేసీఆర్ కు కాలం అనువుగా లేదా? ఆయ‌నేం అనుకున్నారో అవేమీ జ‌ర‌గ‌ట్లేదా?  ఆయ‌న కోరుకున్న‌వి ఒక్కొక్క‌టిగా జ‌ర‌గ‌క‌పోవ‌టం త‌ర్వాత‌.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తికూలంగా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముంద‌స్తుకు స‌రంజామాను సిద్ధం చేసుకున్న కేసీఆర్‌.. తాను అనుకున్న‌ట్లే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయించుకోగ‌లిగారు. తాను పెట్టుకున్న ముహుర్తానికి ఠంచ‌నుగా రాజీనామా ఇచ్చేయ‌ట‌మే కాదు.. తన రాజీనామా ప‌త్రం గ‌వ‌ర్న‌ర్ చేతికి వెళ్ల‌గానే.. ఆ వెంట‌నే జీవో జారీ అయ్యేలా చేయ‌గ‌లిగారు.

అంత‌వ‌ర‌కూ ఆయ‌న కోరుకున్న‌ట్లే అన్ని జ‌రిగినా.. ఆ త‌ర్వాత నుంచే లెక్క‌లు తేడా వ‌స్తున్నాయి. గ‌తంలో  అమ‌లు చేసిన ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతాయే త‌ప్పించి.. వాటికి బ్రేకులు వేసే అధికారం ఎన్నిక‌ల సంఘానికి ఉండ‌ద‌ని కేసీఆర్ భావించినా.. అలాంటిదేమీ లేద‌న్న వైనాన్ని తాజాగా ఈసీ స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.

ఈ నెల 12న బ‌తుక‌మ్మ పండుగ‌ను పుర‌స్క‌రించుకొని తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త ఏడాది నుంచి షురూ చేసిన చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మానికి ఈసీ బ్రేకులు వేయ‌టం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

చీర‌ల పంపిణీకి బ్రేకులు వేసిన ఈసీ.. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గాల్సిన రైతుబంధు చెక్కుల పంపిణీ విష‌యంలోనూ ఈసీ నిర్ణ‌యం వేరుగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లోనూ కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు ప‌థ‌కం కింద ఇవ్వాల్సిన చెక్కులు రెఢీ అవుతున్నాయ‌ని.. బ్యాంకులు చెక్కుల్ని ప్రింట్ చేయిస్తున్నాయ‌ని.. డ‌బ్బులు రెఢీగా ఉన్నట్లు చెప్పారు.

వ‌చ్చే నెల‌లో తాను చెప్పిన‌ట్లే రైతుబంధు చెక్కులు పంపిణీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. కానీ.. ఆయ‌న నోట ఆ మాట వ‌చ్చిన కొద్ది నిమిషాల‌కే చీర‌ల పంపిణీకి బ్రేకులు వేస్తున్న‌ట్లుగా ఈసీ ప్ర‌క‌టించింది. చీర‌ల విష‌యంలోనే ఈసీ తీరు ఇలా ఉంటే.. చెక్కుల పంపిణీ విష‌యంలోనూ ఈసీ నిర్ణ‌యం కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా ఉండంటున్నారు. అదే జ‌రిగితే.. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంతో వ‌చ్చే మైలేజీని లెక్కేసుకున్న కేసీఆర్ కు.. కోడ్ మ‌రో దెబ్బేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాను కోరుకున్న‌వి కోరుకున్న‌ట్లు జ‌ర‌గ‌కుంటే.. శివాలెత్తే అలావాటు కేసీఆర్ లో ఎక్కువే. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో మ‌రింత రౌద్రాన్ని కేసీఆర్ ప్ర‌ద‌ర్శించ‌టం ఖాయ‌మని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News