వ‌లంటీర్ల‌కు ఎన్నిక‌ల విధులు ఇవ్వొద్దంటున్న ఎన్నిక‌ల సంఘం.. కుదిరేప‌నేనా?

Update: 2022-07-15 03:59 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ‌లంటీర్లను ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం (ఈసీ) స్ప‌ష్టం చేసింది. ఏ పార్టీ, ఏ అభ్యర్థి తరఫున వ‌లంటీర్లు పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులిచ్చారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ ఆదేశాల్ని రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. అలాగే ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని కోరారు.

కాగా వైఎస్సార్సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డితో స‌హా హోం శాఖ మంత్రి తానేటి వ‌నిత‌, ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కే వ‌లంటీర్ పోస్టులు ఇచ్చామ‌ని వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేసిన‌వారు, వైఎస్సార్సీపీ నేత‌లు సూచించిన‌వారికే వ‌లంటీర్ పోస్టులు ద‌క్కాయినే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌లంటీర్ల‌ను వినియోగించుకుని.. వైఎస్సార్సీపీ విజ‌యం సాధించ‌డానికి వ్యూహాలు ప‌న్నుతోందంటూ ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

అలాగే ఇటీవ‌ల జ‌రిగిన బ‌ద్వేలు, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో వ‌లంటీర్లు వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేశార‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పుల‌ను ఎన్నిక‌ల సంఘానికి అందించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వ‌లంటీర్ల‌కు ఎన్నిక‌ల విధులు కేటాయించ‌వ‌ద్దంటూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తాజా ఆదేశాల ప్ర‌కారం.. ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వ‌లంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు.

క్షేత్రస్థాయిలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వ‌లంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు. అలా చేస్తే అది నిబంధనలకు విరుద్ధమవుతుంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం గ‌ట్టి ఆదేశాలు ఇచ్చింది.
Tags:    

Similar News