విశాల్ నామినేష‌న్‌ ను రెండోసారి నో అనేశారు

Update: 2017-12-06 04:04 GMT
విష‌యం ఏదైనా కానీ ప్ర‌తిదీ నాట‌కీయంగా మార‌టం ఈ మ‌ధ్య‌న త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఒక అల‌వాటుగా మారింది. ఏ ముహుర్తంలో అమ్మ అనారోగ్యానికి గురైందో.. అప్ప‌టి నుంచి ఆ రాష్ట్రంలో  ఏదీ ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌ర‌గ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఒక‌ప్పుడు త‌మిళ‌నాడు వైపు క‌న్నెత్తి చూడ‌టానికి సైతం  కేంద్రం భ‌య‌ప‌డేది. ఇప్పుడు త‌మ‌ను బంతాట ఆడుకుంటుంద‌న్న మాట అటు అధికారుల్లోనూ..రాజ‌కీయ నేత‌ల్లోనూ వినిపిస్తోంది. అంతేనా.. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ కావ‌ట‌మే కాదు.. ప‌రిశ్ర‌మ‌లు సైతం త‌ర‌లిపోతున్నాయి.

మంగ‌ళ‌వారం భారీ నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నికల బ‌రిలో దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ న‌టుడు విశాల్ మంగ‌ళ‌వారం నామినేష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఊహించ‌నిరీతిలో తెర మీద‌కు వ‌చ్చిన విశాల్ నామినేష‌న్ త‌మిళ‌నాట హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నమైంది.

ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో విశాల్ ఎంట్రీతో ప‌రిస్థితులన్నీ మారిపోవ‌ట‌మే కాదు.. తుది ఫ‌లితం ఆయ‌న‌కు అనుకూలంగా వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సింది లేద‌న్న మాట వినిపించింది.

ఇదిలా ఉంటే..పొలిటిక‌ల్ సీన్ లోకి వ‌చ్చిన పందెంకోడికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. నామినేష‌న్ వేసిన ఆయ‌న‌కు రాజ‌కీయం ఎంత కుట్ర‌పూరితంగా ఉంటుందో తెలిసి వ‌చ్చింది. గంట‌ల  వ్య‌వ‌ధిలో చోటు చేసుకున్న ప‌రిణామాలు ఆయ‌న‌కు దిమ్మ తిరిగిపోయేంత షాకిచ్చాయి. సినిమాల్లో ఎలాంటి సీన్లు ఉంటాయో రియ‌ల్ గా అలాంటి సీన్లే ఎదుర‌య్యేస‌రికి ఆయ‌న నిర‌స‌న బాట ప‌ట్టారు. రీల్‌కు రియ‌ల్‌కు ఎంత‌టి వ్య‌త్యాసం ఉంటుందో ఆయ‌నకు తెలిసి వ‌చ్చి ఉంటుంది.

నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో ఉన్న ఒక నిబంధ‌న‌ను ప్ర‌త్య‌ర్థులు ఒక ఆట ఆడుకోవ‌టం.. ఆ ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా విశాల్ సిద్ధంగా లేక‌పోవ‌టంలో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని భావించిన‌ పందెం కోడికి ఆట మొద‌లుకాక ముందే భారీ షాక్ త‌ప్ప‌లేదు. నామినేష‌న్ దాఖ‌లు చేసే అభ్య‌ర్థి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ది మంది ఓట‌ర్ల సంత‌కాల్ని చేయాల్సి ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్లే ప‌దిమంది సంత‌కాల‌తో నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

అయితే.. త‌న‌కు అనుకూలంగా సంత‌కం పెట్టిన ప‌దిమందిలో సుమ‌తి.. దీప‌న్ అనే ఇద్ద‌రు ఓట‌ర్లు ప్లేటు ఫిరాయించారు. సంత‌కాలు త‌మ‌వి కావ‌ని.. ఎవ‌రో ఫోర్జ‌రీ చేసిన‌ట్లుగా రిట‌ర్నింగ్ అధికారకి లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న నామినేష‌న్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ మ‌లుపును ఊహించ‌ని విశాల్ అవాక్కు అయ్యారు. త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళం విప్పారు. త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం ముందు బైఠాయించారు. ఇదంతా ఎందుకంటే.. అప్ప‌టికే నామినేష‌న్లు దాఖ‌లు చేసే స‌మ‌యం దాటిపోవ‌ట‌మే. గ‌డువు ముగిసిన త‌ర్వాత పోటీకి మ‌రో అవ‌కాశం లేక‌పోవ‌టంతో ఆయ‌న నిర‌స‌న బాటకు మించి మ‌రో మార్గం లేకుండా పోయింది.

నిర‌స‌న‌ల నేప‌థ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విశాల్‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు. నిర‌స‌న‌ల నేప‌థ్యంలోనే.. త‌న‌కు అనుకూలంగా సంత‌కం పెట్టిన వారు ఎందుకు వెన‌క్కి త‌గ్గార‌న్నవిష‌యంపై ఫోక‌స్ చేశారు. సుమ‌తి స‌మీప బంధువైన వేలు అనే వ్య‌క్తికి ఫోన్ చేసి ఆరా తీశారు. అధికార అన్నాడీఎంకే అభ్య‌ర్థి మ‌ధుసూద‌న్‌.. ఆయ‌న అనుచ‌రుడు రాజేశ్ లు త‌మ ఇంట్లో మ‌హిళ‌ల్ని బెదిరించార‌ని.. కొంత డ‌బ్బు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారని.. ఈ కార‌ణంతోనే త‌మ కుటుంబీకులు రిట‌ర్నింగ్ అధికారికి అలా లేఖ ఇచ్చారంటూ వేలు చెప్పారు.

ఈ ఆడియో టేప్‌ను విశాల్ మీడియాకు విడుద‌ల చేయ‌టంతో వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది. ఆడియో క్లిప్ ను విశాల్ రిట‌ర్నింగ్ అధికారికి అందించారు. చీఫ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఏకే జ్యోతితోనూ విశాల్ మాట్లాడారు. ఆ త‌ర్వాత విశాల్ నామినేష‌న్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లుగా రాత్రి ఎనిమిదిన్న గంట‌ల వ్య‌వ‌ధిలో రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. ఆ వెంట‌నే విశాల్ త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. అంతిమంగా న్యాయం గెలిచింద‌ని ట్వీట్ చేశారు. ఇక్క‌డితో ఈ వ్య‌వ‌హారం ముగిస్తే.. అది త‌మిళ‌నాడు ఎందుకు అవుతుంది? ఇక్క‌డే.. ఫైన‌ల్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

రాత్రి ఎనిమిది గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో కానీ.. ఎన్నిక‌ల సంఘం తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని మ‌ళ్లీ స‌వ‌రించుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి 11 గంట‌ల వేళ‌.. ఎన్నిక‌ల సంఘం విశాల్ నామినేష‌న్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. విశాల్ నామినేష‌న్ ప‌త్రాల మీద సంత‌కాలు చేసిన‌ట్లుగా పేర్కొన్న‌వి త‌న‌ది కాద‌ని సుమ‌తి స్వ‌యంగా వ‌చ్చి మ‌రీ చెప్పార‌ని.. దీంతో విశాల్ నామినేష‌న్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. దీంతో.. పోటీలోకి దిగ‌క ముందే పందెం కోడికి త‌మిళ రాజ‌కీయ పంచ్ ప‌డిన‌ట్లైంది.
Tags:    

Similar News