'శరణం అయ్యప్ప' అన్నందుకు హీరోకి ఈసీ నోటీసులు!

Update: 2019-04-08 05:03 GMT
కేరళ ఎన్నికల ప్రచారంలో అయ్యప్పను వాడేస్తున్నారనే మాట వినిపిస్తూ ఉంది. ఇటీవలే శబరిమల అయ్యప్ప దర్శనం విషయంలో జరిగిన రాద్ధాంతం తెలిసిన సంగతే. అయ్యప్ప దేవాలయంలోకి శతాబ్దాలుగా రుతుక్రమంలో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉండేది.  ఈ విషయంలో కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారణకు తీసుకున్న కోర్టు కేరళ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.

అయితే ఆ విషయంలో తమకు అభ్యంతరం లేదని పినరాయి విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయంలోకి మహిళల ఎంట్రీపై తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కోర్టు  అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత చాలా రచ్చే కొనసాగింది.

ఇక ఎన్నికల  వేళ అందుకు సంబంధించిన రాజకీయం కొనసాగుతూ ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉన్న సురేష్ గోపీ తన ప్రచారంలో ‘శరణం అయ్యప్ప’ అనడం పై నోటీసులు జారీ అయ్యాయి. అయ్యప్ప అంశాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని ఈసీ ఇది వరకే సూచించింది. అలాంటి నేపథ్యంలో నటుడు సురేష్ గోపి అలా అనడం ఉద్దేశ పూర్వకం అని, అది రాజకీయ ప్రయోజనాలను పొందే ప్రయత్నం అని ఈసీ అంటోంది.

ఒక జిల్లా కలెక్టర్ ఈ విషయంలో సురేష్ గోపికి నోటీసులు జారీ చేసింది. సమాధానం చెప్పాలని పేర్కొంది. ఈ విషయంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. సదరు మహిళా కలెక్టర్ ప్రచారం కోసమే అలాంటి నోటీసులు ఇచ్చిందని, పబ్లిసిటీ కోసమే అలాంటి నోటీసులు అని కమలం పార్టీ ఎదురుదాడి చేస్తూ ఉంది.
Tags:    

Similar News