తెలంగాణ ప్రజలకు మరో ఎన్నికల పండుగ.. ఈసీ ఓకే

Update: 2019-04-08 06:36 GMT
ఏ ముహుర్తంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలని డిసైడ్ చేశారో కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ వరుస ఎన్నికలే.మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగిసి.. పదకొండుతో పోలింగ్ జరిగిపోతుండటంతో ఎన్నికల వ్యవహారం ముగుస్తుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ కోడ్ అమల్లోకి ఉంటుంది. మరి.. ఫలితాలు ఎప్పుడంటే మే మూడో వారానికి కానీ రావు. మరి.. అప్పటివరకూ ఏం చేయాలంటే.. ఎన్నికల వార్తలతోనూ.. గెలుపు ఎవరిదన్న చర్చలతోనూ కాలం గడపాల్సిందే.

ప్రజలతేకాదు.. ప్రభుత్వాలు కూడా పెద్దగా చేసేదేమీ ఉండదు. దాదాపు గత ఏడాది ఆగస్టు నుంచి తెలంగాణకు పట్టిన ఎన్నికల పీడ.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కూడా వదిలే పరిస్థితి లేదు. ఎన్నికల్ని పీడ ఎందుకని అనాల్సి వస్తుందంటే.. వరుస ఎన్నికల కారణంగా గడిచిన ఏడు నెలలుగా పాలన చక్కగా సాగింది లేదు. మరో మూడునాలుగు నెలలు అదే పరిస్థితి. అంతే.. ఏడాది విలువైన కాలం.. రకరకాల ఎన్నికల కారణంగా కోల్పోవటం అంటే.. డెవలప్ మెంట్ విషయంలోనూ ప్రభావం చూపిస్తుందనటంలో సందేహం లేదు.

ఇంతకీ.. లోక్ సభ ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికలా?  అవేంటంటారా?  అక్కడికే వస్తున్నాం.  లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే.. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పేసింది. అయితే.. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఫలితాలు వెల్లడించకూడదన్న షరతు విధించింది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అవుతుందా?. కాస్త ఆగి రిలీజ్ అవుతుందా? అన్న దానిపై మాత్రం స్పష్టత రాని పరిస్థితి.

అయితే.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి ఎన్నికల ప్రక్రియ.. కీలకమైన పోలింగ్ కూడా జరిగిపోవటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. బ్యాక్ టు బ్యాక్ ఎన్నికలతో తెలంగాణలో మరో పండక్కి తెర లేచినట్లే. స్థానిక రాజకీయ సంరంభం అధికారపక్షానికి ఆటగా మారితే.. ప్రతిపక్షానికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. వరుస గెలుపుతో గులాబీ దళం చెలరేగిపోతుంటే.. వరుస ఓటమిటలో విపక్షం కుదేలవుతున్న దుస్థితి.


Tags:    

Similar News