పార్టీలు హ్యాపీగా ఫీలయ్యేలా ఈసీ నిర్ణయం

Update: 2016-08-23 05:26 GMT
ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం కొన్ని రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఊరటనిస్తుందని చెప్పాలి. ‘హమ్మయ్య’ అని అనిపించేలా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కొన్ని రాజకీయ పార్టీలు గుర్తింపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడినట్లుగా చెప్పొచ్చు.ఇప్పటికే ఉన్న రూల్స్ లో కొన్నింటిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్ని రాజకీయ పార్టీల ఉనికికి ఢోకా లేదని చెప్పాలి.

రాజకీయ పార్టీలకు గుర్తింపు కొనసాగించటంపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి సమీక్ష జరుపుతారు. ఈ సమీక్షలో ఆ పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య.. ఎన్నికల్లో వచ్చే ఓట్ల ఆధారంగా ఆయా పార్టీలకు గుర్తింపు ఏం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంటారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా రాజకీయ పార్టీ లేదంటే కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తే.. కొన్ని జాతీయ పార్టీల మీద ఈ ప్రభావం భారీగా ఉంటుంది.

వారికి వచ్చే ఓట్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నిర్వహించే సమీక్షలో నిబంధనలకు తగ్గట్లుగా ఓట్లు రాబట్టని పార్టీలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే.. ఈ విధానాన్ని మారుస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో.. జాతీయ స్థాయిలో గుర్తింపు కోల్పోయే ప్రమాదంలో పడిన సీపీఐ.. బీఎస్పీ.. ఎన్సీపీలకు ఈ నిర్ణయం పెద్ద ఊరట ఇచ్చే అవకాశం ఉంది.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయస్థాయిలో కానీ ఒక పార్టీకి గుర్తింపు ఇవ్వటానికి అనుసరించే విధానంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ.. సమీక్షించే సమయాన్ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించటంతో జాతీయ పార్టీలకు ఇదో ఊరటగా మారనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ కారణంగా పలు జాతీయ పార్టీలకు ఓట్లు ఆశించినంత రాలేదు. దీంతో.. అవి గుర్తింపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఈసీ తాజాగా తీసుకున్న నిర్ణయం జాతీయ పార్టీలకు ఊరటనివ్వనుంది.
Tags:    

Similar News