కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల మ‌ధ్య లుక‌లుక‌లు!

Update: 2019-05-18 11:36 GMT
ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీద రాజ‌కీయ పార్టీలు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేస్తున్న వైనం తెలిసిందే. ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అయితే ఈసీ తీరును ఘాటుగా త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘంలోని కీల‌క‌మైన ముగ్గురు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరు చ‌ట్ట‌బ‌ద్ధంగా ఉండాలంటూ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌లో ఒక‌రైన అశోక్ లావాసా రాసిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. నేత‌ల‌కు క్లీన్ చిట్ ఇచ్చే స‌మ‌యంలో త‌న వాద‌న‌ను రికార్డు చేయ‌లేదంటూ ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. సీఈసీ అరోరాకు లావాసా రాసిన లేఖ‌లో ఆయ‌న త‌న అసంతృప్తిని ప్ర‌ముఖంగా పేర్కొన్నారు.

మైనార్టీల అభిప్రాయాల్ని కూడా రికార్డు చేయాల‌ని పేర్కొన్నారు. మెజార్టీల అభిప్రాయాల‌ను మాత్ర‌మే రికార్డు చేస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం అంటోంది. ఇది సరికాద‌న్న‌ది లావాసా వాద‌న‌గా ఉంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. క‌మ‌ష‌నర్ల మ‌ధ్య లుక‌లుక‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే లావాసా రాసిన లేఖ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ సునీల్ అరోడా స్పందించారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌భ్యుల మ‌ధ్య భేదాభిప్రాయాలు ఉండ‌టంపైన రియాక్ట్ అయిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల సంఘంలోని ముగ్గురుస‌భ్యులు ఒకేలా ఉండ‌రు. ఇలా జ‌ర‌గ‌టం ఇదేమీ తొలిసారి కాద‌ని.. ఒక‌రి అభిప్రాయాలు మ‌రొకరితో క‌ల‌వ‌క‌పోవ‌టం లాంటివి గ‌తంలోనూ చోటు చేసుకున్న‌ట్లు గుర్తు చేశారు. ఇదేమీ తొలిసారి కాద‌ని ఆయ‌న ఇష్యూను తేల్చేశారు.

ఇదిలా ఉంటే.. సీఈసీలోని మ‌రో ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు తీసుకునే నిర్ణ‌యాల మీద లావాసా అసంతృప్తిలో ఉన్నారు. మోడీ.. అమిత్ షాల మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై ఆయ‌న మిగిలిన ఇద్ద‌రు స‌భ్యుల నిర్ణ‌యాల‌కు భిన్నంగా ఉన్నారు. దీంతో.. ఆయ‌న కొద్ది రోజులుగా స‌మావేశాల‌కు దూరంగా ఉంటూ.. త‌న అభిప్రాయాల్ని పేర్కొన‌టం లేదు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో మ‌రెంత దూరం వెళుతుందో చూడాలి.


Tags:    

Similar News