ఆ ఎన్నికల కమిషనర్ భార్యకు ఐటీ శాఖ నోటీసులు

Update: 2019-09-24 06:08 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న పలువురికి ఇటీవల కాలంలో కీలక శాఖల నుంచి నోటీసులు అందుకోవాల్సి రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా అదే కోవలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా సతీమణి ఆరోపణలు ఎదుర్కోవటం ఇప్పుడు సంచనలంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీ.. అమిత్ షాల మీద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా వచ్చిన పలు ఫిర్యాదులపై క్లీన్ చిట్ ఇవ్వటాన్ని వ్యతిరేకించిన ప్రముఖుల్లో అశోక్ లావాసా ఒకరన్న విసయాన్ని మర్చిపోకూడదు.

ఆదాయంలో తీవ్రమైన హెచ్చు తగ్గులు చూపిస్తున్నారని.. వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అశోక్ లావాసా సతీమణి నోవల్ సింఘాల్ గతంలో ఎస్ బీఐలో పని చేశారు. 2005లో ఆమె తన జాబ్ కు రిజైన్ చేశారు. అనంతరం  2015-17 మధ్య కాలంలో పలు సంస్థలకు డైరెక్టర్లుగా వ్యవహరించారు.

ఆ సమయంలో పొందిన ఆదాయంపైన పలు సందేహాల్ని ఐటీ శాఖ వ్యక్తం చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిగా అశోక్ లావాసా 2018 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీషాల మీద పలు కంప్లైంట్లు రావటం. . ఆ సందర్భంగా వారిపై క్లీన్ చిట్ ఇచ్చేందుకు లావాసా వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు.. మోడల్ కండక్ట్ పై ఈసీ ప్రధానాధికారి సునీల్ ఆరోరా.. మరో అధికారి సశీల్ చంద్రతోనూ ఆయన విభేదించినట్లుగా చెబుతారు. అలాంటి ఆయన సతీమణిపై ఇప్పుడు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News