మోడీపై పీకే ‘రాష్ట్రపతి’ బాంబ్

Update: 2021-07-14 14:30 GMT
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్ గా చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. బిజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని తపన పడుతున్నారు.

వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రతిపక్షాలకు ఇవ్వడం కోసం పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం అదే ఎత్తుగడతో ప్రాంతీయ పార్టీలను కలుస్తున్నారా? అంటే ఔననే సమాదానం వస్తోంది.

ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం అయ్యారు. శరద్ పవార్ తో పలు దఫాలు చర్చలు జరిపారు.  సమావేశాల పూర్తి సమాచారం బయటకు రాకపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా బలమైన కూటమి ఏర్పాట్ల వైపు ప్రతిపక్షాలను నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ వరుస సమావేశాలు రాజకీయవర్గాల్లో బలమైన సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఏకంగా శరద్ పవార్ ను రాష్ట్రపతిగా ఎన్నికయ్యేలా చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నాని ప్రచారం సాగుతోంది.

నిజానికి ఈ ప్రయత్నాలు ఇప్పటివీ కావు.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీకే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి వాటిని గెలిపిస్తూ మోడీపై ప్రతీకారానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ మూడు సార్లు శరద్ పవార్ ను కలిశారు. శరద్ పవార్ ను న్యూఢిల్లీ నివాసంలో జరిగిన ఈ సమావేశాలలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఈ కూటమి సమావేశమైందని నమ్ముతున్నారు.

తాజాగా రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీలతో  ప్రశాంత్ కిషోర్ సమావేశం బీజేపీ, నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జరిగిందని అంటున్నారు. ప్రతిపక్ష రాజకీయ పోరాటానికి కొత్త కోణాన్ని జోడించిందంటున్నారు. ఇది వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ కేంద్రీకృతమై ఉండొచ్చని అంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ వేస్తున్న లెక్కల ప్రకారం.. ఒక్క ఒడిషా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఓడిపోతారని భావిస్తున్నారు. ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర, తమిళనాడులు కూడా కీలకం. ఇందుకోసమే నవీన్ పట్నాయక్ ను, తమిళనాడు సీఎం స్టాలిన్ ను పీకే కలిసి మంతనాలు జరిపారంటున్నారు.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రేలతో పీకేకు మంచి సంబంధాలున్నాయి. వారి గెలుపునకు పీకే బాటలు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా అందులో కలిపేస్తే  రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఓడించడం పెద్ద సమస్య కాదంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ తాజాగా రాహుల్, ప్రియాంకలతో రెండు గంటలు పైగా చర్చించారు. ప్రశాంత్ కిషోర్ తన ప్రణాళికల గురించి కాంగ్రెస్ నాయకత్వానికి వివరించారని.. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఉన్న అవకాశాలు, సంభావ్యతలను కూడా క్లుప్తీకరించారనీ చెబుతున్నారు.

 ప్రతిపక్ష ఐక్యతతో వారు బీజేపీని కలవరపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది దేశంలో రాజకీయాలనే వేడెక్కించే పరిణామం అని.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించడానికి పీకే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి కొత్త ఆట ఆడేందుకు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News