తెలంగాణ‌లో ఒక‌సారి.. ఆంధ్రాలో రెండుసార్లు!

Update: 2019-01-14 06:39 GMT
కేసీఆర్ పుణ్య‌మా అని.. గ‌డిచిన నాలుగు నెల‌లుగా ఎన్నిక‌ల కోలాహ‌లం తెలంగాణ‌లో నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో హాట్ హాట్ గా ఎన్నిక‌లు న‌డుస్తున్న వేళ‌.. ఏపీలోనూ అదే త‌ర‌హా ఆస‌క్తి నెల‌కొంది. ఎన్నిక‌ల హ‌డావుడి ముగిసి.. తెలంగాణ‌లో పాల‌న ఒక గాడిలో ప‌డుతున్న వేళ‌.. లోక్ స‌భ ఎన్నిక‌ల న‌గ‌రా మోగించేందుకు ఏర్పాట్లు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. ఈ ఏడాది మే చివ‌రి వారంలోపు లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని డిసైడ్ అయ్యింది.

ఎన్నిక‌ల ఏర్పాట్లు ప‌రిశీలించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర ఎన్నిక‌ల‌సంఘం బృందం.. త్వ‌ర‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నుంది. ఇక్క‌డి ఏర్పాట్లు చూసిన త‌ర్వాత ఎన్నిక‌ల్ని ఏ రీతిలో నిర్వ‌హించాల‌న్న దానిపై ఒక నిర్ణ‌యం తీసుకోనుంది.

ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో లేదంటే.. మార్చి మొద‌టివారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించేందుకు అనువైన తేదీని డిసైడ్ చేయ‌నుంది. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో సాగుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే మిగిలింది.

అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నిక‌ల్నినిర్వ‌హించే అవ‌కాశం ఉందంటున్నారు. ప‌రిమితంగా ఉన్న లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే తెలంగాణ‌లో నిర్వ‌హించాల్సి ఉండ‌టంతో ఒకే ద‌శ‌లో పూర్తి చేయాల‌న్న‌ది ఈసీ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి  చేసిన నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఒకే ద‌ఫాలో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించే దిశ‌గా ఈసీ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం రెండు ద‌ఫాలుగా ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ఒకేసారి రెండు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి రావ‌టం.. స‌మ‌స్యాత్మ‌క‌.. సున్నిత స్థానాలు ఎక్కువ‌గా ఉన్న‌నేప‌థ్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను ఒకే ద‌ఫాలో కాకుండా రెండు సార్లుగా నిర్వ‌హిస్తారు. ఫ‌లితాలు మాత్రం మొత్తంగా ఒకేసారి వెల్ల‌డిస్తారు. 2014లో నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని చూస్తే.. దేశ వ్యాప్తంగా 9 ద‌శ‌ల్లో నిర్వ‌హించారు. నాడు.. ఏప్రిల్ ఏడో తేదీన తొలిద‌శ పోలింగ్ జ‌ర‌గ్గా.. మే 12న చివ‌రిదైన తొమ్మిదో ద‌శ పోలింగ్ నిర్వ‌హించారు. ఓట్ల లెక్కింపును మాత్రం ఒకేసారి మే 16న నిర్వ‌హించారు.

2014లో ఎన్నిక‌ల ప్ర‌క్రియను మే 28 నాటికి పూర్తి చేయ‌గా.. ఈసారి మాత్రం మ‌రో నాలుగు రోజులు ముందుగా అంటే.. మే 24 నాటికి పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఈసీ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.  అంటే.. మ‌హా అయితే మ‌రో నెల రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంద‌న్న మాట‌. ఎన్నిక‌ల వేడి రాజుకోవ‌టానికి ముందే.. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు రాజ‌కీయం వైపునే తిరుగుతాయ‌న్న దాన్లో ఎలాంటి సందేహానికి తావు లేదు.


Tags:    

Similar News