కేసీఆర్ సర్కారు వారి ‘బాదుడు’ మొదలైంది

Update: 2016-06-22 14:17 GMT
వరాలిచ్చే రోజులు అయిపోయాయి. వరాల్ని బ్యాలెన్స్ చేసేందుకు వీలుగా బాదుడు పర్వం మొదలైంది. సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుందని.. పగలు మాత్రమే కాదు చీకటి కూడా ఉంటుందన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయేలా మాటలు చెప్పే కేసీఆర్ సర్కారు తనలోని మరో కోణాన్ని పదర్శించింది. జనాలకు వరాల మీద వరాలు ఇవ్వటం.. తాయిలాలు తినిపించినట్లే.. వడ్డనల మోత తప్పదన్న విషయాన్ని తన తాజా చర్యతో స్పష్టం చేసింది. విద్యుత్.. ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

నిజానికి బాదుడు పర్వం షురూ కానున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రానికి దిశా నిర్దేకులైన తండ్రి కొడుకులు తమ మాటల్లో చెప్పకనే చెప్పేశారు. ఈ మధ్యన ఆర్టీసీ రివ్యూ సందర్భంగా అధికారుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. బస్సు ఛార్జీలు ఏ ఏడాదికి ఆ ఏడాది పెంచుతూ ఉంటే ప్రజలకు భారంగా అనిపించదన్నారు. ఇలా ఆయన నోటి నుంచి ఛార్జీల పెంపు మాట వచ్చిన రెండు రోజులకే ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ జీహెచ్ ఎంసీ అధికారులతో మాట్లాడుతూ.. వసతులతో పాటు పన్ను పోటు కూడా తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. ఆయన నోటి నుంచి మాట వచ్చిన రెండు రోజులకే తెలంగాణ ప్రభుత్వం కీలకమైన రెండు రంగాల్లో ఛార్జీల పెంచుతూ నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం.

విద్యుత్.. ఆర్టీసీ బస్సు ఛార్జీల్ని పెంచాలన్న అధికారుల నిర్ణయానికి తెలంగాణ సర్కారు ఓకే చెప్పేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్య.. గృహ వినియోగదారుల మీద అదనపు భారం పడకుండా కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 100 యూనిట్ల లోపు వినియోగానికి ఎలాంటి పెంపు ఉండదని.. 100 యూనిట్ల పైన వాడకందార్లకు స్వల్ప పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. ఏ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచనున్న విషయాన్ని గురువారం వెల్లడించనున్నారు.

అదే సమయంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఛార్జీల పెంపు 10 శాతం మేర ఉంటుందని చెబుతున్నారు. 30 కిలోమీటర్ల పు పల్లెవెలుగు బస్సుల్లో రూపాయి.. 30 కిలోమీటర్ల పైన 2 రూపాయిల భారాన్ని వేయాలని.. మిగిలిన బస్సుల్లో 10 శాతానికి మించకుండా ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. ఈ రెండు నిర్ణయాలతో.. ఆయా రంగాలకు సంబంధించిన మిగిలిన రంగాలు సైతం పనిలో పనిగా ధరల్ని పెంచేలా నిర్ణయం తీసుకోవటం ఖాయమని చెప్పాలి.
Tags:    

Similar News