మీకిప్పుడు చెప్పేవన్నీ ఫ్యూచర్లో జరిగేవే..

Update: 2016-09-29 22:30 GMT
ఇప్పుడు మీకు చెప్పే అంశాల్ని వింటే.. ఒక పట్టాన నమ్మరు. కానీ.. అవన్నీ ఫ్యూచర్ లో జరిగేవేనని నమ్మకంగా చెబుతున్నారు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన ఎవరో చెప్పే ముందు.. ఆయన చెప్పే మాటల్ని వింటే మరింత ఆసక్తికరంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఇంతకీ సదరు పారిశ్రామికవేత్త చెప్పే విషయాల్ని చూస్తే.. ఇప్పటివరకూ ఒక దేశం నుంచి మరో దేశానికి.. ఒక ఖండం నుంచి మరో ఖండానికి ప్రయాణిస్తున్నాం. అయితే.. రానున్న రోజుల్లో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయటం పెద్ద కష్టమేమీ కాదని తేల్చేస్తున్నారు. సదూర తీరాన ఉన్న అరుణగ్రహంలో కాపురం పెట్టే టైం దగ్గరకు వచ్చేసిందని చెబుతున్నారు.

మహా అయితే.. మరోవందేళ్లలో ఇలాంటిది సాధ్యమని చెబుతున్నారు. కనీసం పది లక్షల జనాభాతో అరుణ గ్రహాన్ని నింపుతానన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు సదరు పారిశ్రామిక వేత్త. అంతే కాదు.. అంతరిక్షంలోకి వెళ్లిన రాకెట్ బూస్టర్లు ఒక దశ దాటిన తర్వాత తిరిగి భూమికి తిరిగి వచ్చి.. మళ్లీ వినియోగించుకోవటానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇన్ని హడావుడి మాటలు చెబుతున్న ఈ పెద్దమనిషి ఎవరు? ఆయనకున్న అర్హత ఏమిటి? ఆయన మాటల్నిఎంతవరకు నమ్మొచ్చు అన్నది చూస్తే..

ఒక పట్టాన నమ్మలేనట్లుగా ఉన్న మాటల్ని చెబుతున్న పెద్దమనిషి పేరు ఎలన్ మస్క్. అమెరికాకు చెందిన టెస్లా అనే కంపెనీ ఈయనదే. ఈ కంపెనీ గొప్పతనం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుందీ కంపెనీ. మస్క్ ఈ కార్ల కంపెనీకి మాత్రమే ఓనర్ కాదు.. హైపర్ లూప్ పేరుతో అతి చౌకగా రవాణా వ్యవస్థను ప్రపంచానికి అందించేందుకు ప్రయత్నిస్తున్న టెక్ విజర్డ్ కూడా. స్పేస్ ఎక్స్ కంపెనీతో మళ్లీ మళ్లీ వాడుకునే వీలున్న రాకెట్లను అభివృద్ధి చేస్తున్న ఆయన.. తాము తయారు చేసిన రాకెట్ (డ్రాగన్ -2) ను 2018లో ప్రయోగాత్మకంగా అరుణ గ్రహం మీదకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా జరిగిన అంతర్జాతీయ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్ లో మాట్లాడిన ఈ పారిశ్రామికవేత్త.. వందమందిని మోసుకెళ్లే వ్యోమనౌక తయారీ పెద్ద కష్టమేకాదని.. 42 ఇంజిన్లతో కూడిన వ్యోమనౌకల్లో 200 మందిని ఈజీగా పంపొచ్చని చెబుతన్నారు. 18 బోయింగ్ 737 విమానాలు విడుదల చేసేంత శక్తితో తమ రాకెట్లు భూ వాతావరణాన్ని దాటుతాయని.. ఆ తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతున్న భారీ ట్యాంకు నుంచి ఇంధనాన్ని నింపుకొని తమ రాకెట్లు అంగారక గ్రహం వైపు ప్రయాణమవుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఇంధనం నింపే ట్యాంకులు సైతం.. భూమి నుంచి రావటం.. ఫిల్ చేసుకొని పైకి వెళ్లి ఉండటం చేస్తాయని చెబుతున్నారు.

ఆరేళ్ల వ్యవధిలో మనుషులతో కూడిన అంగారక యాత్ర జరగటం ఖాయమని చెప్పే ఆయన.. మనుషులు నివసించేందుకు వీలైనట్లుగా అంగారకగ్రహాన్ని తయారు చేయటానికి కనీసం వందేళ్లు పడుతుందని చెబుతున్నారు. అంగారకుడ్ని మానవ నివాస యోగ్యంగా చేయటమే తన ప్లాన్ గా చెబుతారు. ఇదంతా ఓకే... మరి ఈ టూర్ రేటెంత అంటే... జస్ట్ 1.5 కోట్లు (ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం) ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కోటీశ్వరుల మార్కెట్ ను పరిగణలోకి తీసుకుంటే.. మస్క్ బిజినెస్ ఐడియా ఎంత బ్రహ్మాండమైందో ఇట్టే అర్థమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News