శ్రీలంకలో ఎమర్జెన్సీ.. మల్దీవులకు పారిపోయిన రాజపక్స.. పోటెత్తిన ప్రజలు

Update: 2022-07-13 09:30 GMT
ఆర్థిక సంక్షోభంలో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం దాటి మల్దీవులకు చెక్కేశాడని తెలియడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వేల సంఖ్యలో నిరసనకారులు కొలంబో వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ఇంటిని ముట్టడించడంతో ఆర్మీ నీటి ఫిరంగులు, భాష్పవాయువు గోళాలను ప్రయోగించాయి. పరిస్థితులు అదుపు తప్పేలా కనిపించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఎమర్జెన్సీ ప్రకటించడంతోపాటు రాజపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఈ ప్రకటన చేశారు.

అధ్యక్షుడు రాజపక్స దేశం దాటి పారిపోవడంతో ప్రజాగ్రహం పెల్లుబుకింది. పార్లమెంట్ ముట్టడికి ప్రజలు కదిలి వస్తుండడంతో ఎమర్జెన్సీ పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ప్రకటించారు. నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. ఆందోళనలు అదుపులోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎం ఆఫీస్ ప్రకటించింది.

గొటబాయ రాజపక్స ఈరోజు రాజీనామా చేయాల్సి ఉండగా.. ఈ తెల్లవారుజామున దేశం దాటి మాల్దీవులకు పారిపోయాడు. దాంతో శనివారం తర్వాత నిరసనకారులు మరోసారి తమ ఆందోళనలు తీవ్రతరం చేశారు. పార్లమెంట్, ప్రధాని నివాసం వైపు ర్యాలీగా బయలు దేరారు. ఈరోజు మధ్యాహ్నం కల్లా గొటబాయ రాజీనామా చేయాలని ప్రజలు, నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పదవిని వీడకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క కొందరు సైనికులు వారికి సహకరిస్తూ ఆందోళనలకు మద్దతు తెలిపారు. వారికి నీళ్లు అందించి దాహార్తి తీరుస్తున్నారు.

స్వదేశంలో  తీవ్ర వ్యతిరేకతతో దేశం విడిచి మాల్దీవులు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అక్కడి నుంచి కూడా వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇక మల్దీవుల ప్రజలు సైతం శ్రీలంక వాసులకు తమ మద్దతును ప్రకటించారు.

ఇక గొటబాయ దేశం దాటి వెళ్లిపోవడంతో రణిల్ విక్రమ సింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహింద అభయవర్ధన నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ ఇప్పటివరకూ రాజీనామా చేయలేదు. ఆయన దేశంలో లేకపోవడంతో ప్రస్తుతం రణిల్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఈయన కూడా దిగిపోవాలని.. అధ్యక్ష పదవిలో కూర్చోవద్దని నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.



Full View
Tags:    

Similar News