టీడీపీకి ఎమోషనల్ ఫోర్స్ ...?

Update: 2021-11-20 16:30 GMT
ఎమోషనల్ అంటే తెలుగులో భావోద్వేగం. దానిని మించిన ఆయుధం వేరొకటి లేదు. తెలుగుదేశం ఇపుడు దేనికీ కనెక్ట్ కాకుండా ఉంది. దాంతో పెద్దాయన చంద్రబాబు ఎంతలా మొత్తుకుంటున్నా నాయకులు పడక దిగి రావడంలేదు. తమ్ముళ్లలో కూడా కసి ఎక్కడా రేగడంలేదు. అయితే కొన్ని అన్యూహ్య ఘటనల నేపధ్యంలో  చంద్రబాబు కార్చిన ఒక్కో కన్నీటి చుక్కా టీడీపీలో మొత్తానికి మొత్తం క్యాడర్ కి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. అదే టైమ్ లో ఎమోషనల్ పాలిటిక్స్ ఎపుడూ సక్సెస్ అయ్యాయి. నాడు తనకు ఢిల్లీ పాలకులు అవమానం చేసి గద్దె దించారని ఎన్టీయార్ జనంలోకి వస్తే ఆదరించారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు  కుట్ర చేసి వైఎస్సార్ కుమారుడు అయిన  తనను పదహారు నెలలు జైలు పాలు చేశారు  అని జగన్ ప్రజల వద్దకు వస్తే ఆయన్ని ఆదరించి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఇపుడు అలాంటి ఎమోషనల్ అంశాన్ని చంద్రబాబు పట్టుకున్నారనే అంటున్నారు.

తన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటే టీడీపీ తప్పని సరిగా అధికారంలోకి రావాల్సిందే అన్న బాబు పిలుపు ఇపుడు తమ్ముళ్లకు కచ్చితంగా వీరావేశం తెప్పించేదే. తెలుగుదేశం అధినేతకు జరిగిన పరాభవం ప్రతీ కార్యకర్తకూ కర్తవ్యం గుర్తు చేస్తుంది. ఇంతకాలం మనకెందుకులే అని పట్టని వారు కూడా ఇపుడు పూర్తిగా  రీచార్జి అవుతారు. ఎలాగైనా ఏపీలో వైసీపీని గద్దె దించాల్సిందే అన్న పూనకాలతో క్యాడర్ అంతా ఒక్క లెక్కన జనంలోకి వెళ్తుంది. చంద్రబాబు కూడా ఇదే ఆలోచించి ఉండొచ్చు. ఆయన కుటుంబ సభ్యుల విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు మీద కూడా జనంలో చర్చకు పెడుతూనే పార్టీని కూడా ఈ దిశగా నడిపించలాని ఆయన ఆలోచనగా ఉంది.

ఇంతకాలం తెలుగుదేశం అనేక ప్రజా సమస్యలు తలకెత్తుకుంది. కానీ జనం మాట దేముడెరుగు పార్టీ యంత్రాంగం నుంచే సరైన స్పందన లభించలేదు. ఇపుడు మాత్రం అలాంటిది కాదు, ఏకంగా చంద్రబాబునే ప‌ర్సనల్ గా టార్గెట్ చేశారు అంటే కార్యకర్త నిప్పులు చెరగడం ఖాయం. రంగంలోకి దూకి కదం తొక్కడమూ ఖాయమే. ఇక ప్రజల విషయం తీసుకుంటే వారు చాలా తేలికగా భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు వయసు ఏడుపదులు దాటింది. సీనియర్ మోస్ట్ అధినేత. అందువల్ల ఆయన విషయం తీసుకుంటే కచ్చితంగా సానుభూతి వర్కౌట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు సైతం తన కన్నీటి కధను జనాల్లోకి గట్టిగానే తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాంతో అటు పార్టీ రీచార్జి కావడమే కాదు ఇటు జనాల్లో కూడా పాజిటివ్ రియాక్షన్స్ వస్తే కనుక టీడీపీకి అది అన్ని రకాలుగానూ పొలిటికల్ గా  మేలు చేసేదే. మొత్తానికి చంద్రబాబు కన్నీటితో టీడీపీకి మళ్ళీ పన్నీరు చిలకబోతున్నారు అన్నదే ఒక అర్ధవంతమైన విశ్లేషణ.
Tags:    

Similar News