ఏపీ స‌ర్కార్ వ‌ర్సెస్ ఉద్యోగులు.. హైకోర్టులో బంతి...!

Update: 2022-01-20 13:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంతో ప్ర‌భుత్వ ఉద్యోగులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పీఆర్సీలో కోత‌లు, హెచ్ఆర్ఏ త‌గ్గింపుతో ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత‌లు త‌ప్ప‌లేదు. దీంతో వారు ప్ర‌భుత్వం వేత‌న స‌వ‌ర‌ణ‌పై జారీ చేసిన జీవోను స‌వాల్ చేస్తూ గురువారం ఉద్యోగులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు ఏపీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ఈ జీవో విరుద్ధ‌మంటూ ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం కేవీ కృష్ణయ్య రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కృష్ణయ్య ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖల అధికారులను త‌న పిటిష‌న్లో ప్రతివాదులుగా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంను ఆమోదించినందుకున కేంద్ర హోం శాఖ‌ను కూడా ఈ కేసులో ఆయ‌న చేర్చారు. ఏపీ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఉద్యోగుల ప్ర‌యోజ‌నాల‌కు పూర్తి ర‌క్ష‌ణ ఉంద‌న్న విష‌యాన్ని కృష్ణ‌య్య స్ప‌ష్టం చేశారు. కానీ ప్ర‌భుత్వం అమలు చేస్తోన్న పీఆర్సీ నివేదిక‌తో జీతాలు చాలా వ‌ర‌కు కోత ప‌డ్డాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

త‌మ డిమాండ్ల ప‌రిష్కారం కోరుతూ ఆందోళ‌న చేస్తోన‌న్న ఉద్యోగులు త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఈ పోరాటం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇదిలా ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటోన్న ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు కె. వెంక‌ట్రామిరెడ్డి సైతం ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో క‌లిసి తాము ఉమ్మ‌డి ఆందోళ‌న చేప‌ట్టేందుకు రెడీగా ఉన్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. ఇందుకు జేఏసీ ఏర్పాటు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

ఇదిలా ఉంటే పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ నిర‌వ‌ధిక స‌మ్మె చేయాల‌ని నిర్ణ‌యించిన ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై మంత్రుల‌తో పాటు అధికార పార్టీకి చెందిన నేత‌లు కౌంట‌ర్ ఎటాక్‌లు చేస్తున్నారు. తాము అన్ని సంఘాల‌తో చ‌ర్చించాకే పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశామ‌ని చెప్పారు. క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇలా ఉంటే ఉద్యోగులు ఇలా ఆందోళ‌న‌కు దిగ‌డం స‌రికాద‌ని మంత్రి బొత్స అన్నారు.  ఉద్యోగుల‌ను ఒప్పించేందుకు మ‌రోసారి తాము ప్ర‌భుత్వం త‌ర‌పున చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని బొత్స తెలిపారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన పీఆర్‌సీని అంగీకరించి రాష్ట్ర ఉద్యోగులు సమ్మెకు దిగడం సరికాదన్నారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే వారు పీఆర్సీపై హ‌ర్షం వ్య‌క్తం చేసి.. ఇప్పుడు రివ‌ర్స్ అవ్వడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏదేమైనా ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఉద్యోగుల మ‌ద్ధ యుద్ధం ముదిరేలా ఉంది. దీనికి ఎలా చెక్ ప‌డుతుందో ?  చూడాలి.
Tags:    

Similar News