ఎన్ కౌంటర్: వైఎస్ ను గుర్తుకు తెచ్చిన కేసీఆర్

Update: 2019-12-06 07:20 GMT
హైదరాబాద్ లో దిశను అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను ఈ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. విచారణలో భాగంగా నిందితులను ‘దిశ’ను కాల్చిన చోటుకు తీసుకెళ్లగా.. అక్కడ సీన్ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించడం.. రాళ్లు రువ్వడం.. పోలీసులపై తిరగబడడంతో ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ వార్త విని దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘దిశ’కు సరైన న్యాయం జరిగిందని కొనియాడుతున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్, పోలీసులు చేసిన పనిని కరెక్ట్ అంటూ మీడియాల ఎదుట చెబుతున్నారు.

కేసీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా పోలీసులకు పెద్ద ఎత్తున అత్యాధునిక వాహనాలు, పెట్రోలింగ్ కోసం బైక్ లు, జీప్ లు, గన్స్, అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందించారు. తెలంగాణ వస్తే మావోయిస్టుల రాజ్యంగా మారుతుందని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు, ప్రతిపక్షాలు బెదిరించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని భయపెట్టారు.

అందుకే కేసీఆర్ గద్దెనెక్కగానే పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. గ్యాంగ్ స్టర్ నయీంను ఎన్ కౌంటర్ చేసి తెలంగాణలో దందాలకు అవకాశం లేదని రౌడీలు, గుండాలకు హెచ్చరికలు పంపారు.

తాజాగా దేశవ్యాప్తంగా కేసీఆర్ సర్కారును, తెలంగాణ పోలీసుల తీరుపై వచ్చిన విమర్శలకు చెక్ చెబుతూ ‘దిశ’ హంతకులను ఎన్ కౌంటర్ లో లేపేశారు. న్యాయవ్యవస్థలోని జాప్యంతో నిందితులకు ఇప్పట్లో శిక్షలు పడవని కేసీఆర్ కు తెలుసు. ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టు, సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా న్యాయస్థానం రిమాండ్ విధించడంపై ప్రజల్లో ఆగ్రహజ్వాల చెలరేగింది. అందుకే కేసీఆర్ ఈ కఠిన నిర్ణయంతో సత్వర న్యాయం చేశారు.

కేసీఆర్ తీరు నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తున్నారని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పదేళ్ల కిందట ఇలానే వరంగల్ లో యాసిడ్ పోసిన నిందితులను ఎన్ కౌంటర్ చేసింది నాటి వైఎస్ ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ హంతకుల కేసులో కేసీఆర్ దాన్నే ఫాలో అయిపోయారు. ఏదీ ఏమైనా అమ్మాయిలపై ఆకృత్యాలు, తెలంగాణలో దారుణాలపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News