సిక్సర్ల మోత.. వన్డే చరిత్రలో కొత్త రికార్డు!

Update: 2019-06-18 17:29 GMT
అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ను రికార్డుల సవరించేందుకు బాగా ఉపయోగించుకుంది  ఇంగ్లిష్ క్రికెట్ జట్టు. సొంత గడ్డ మీద జరుగుతున్న ప్రపంచకప్ లో ఇంగ్లండ్ మరోసారి దూకుడు అయిన ఆట తీరును కనబరిచింది. అఫ్గాన్ బౌలర్లను ఇంగ్లిష్ బ్యాట్స్ మన్ ఒక ఆట ఆడుకున్నారు.

ప్రత్యేకించి అఫ్గానిస్తాన్ చాంఫియన్ బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. తొమ్మిది ఓవర్లలో రషీద్  ఖాన్ నుంచి 110 పరుగులను పిండుకున్నారు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్. ఆఖర్లో కాస్త వేగం తగ్గింది కానీ లేకపోతే ఇంగ్లండ్ స్కోరు అలవోకగా నాలుగు వందల పరుగులు దాటేది.

అయినప్పటికీ ఈ మ్యాచ్ తో వన్డే క్రికెట్ చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించాడు ఇంగ్లిష్ బ్యాట్స్ మన్ ఇమాన్ మోర్గాన్. ఏకంగా 17 సిక్సులు బాదాడు మోర్గాన్. ఇదివరకూ వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో ఇన్ని సిక్సులు కొట్టిన మొనగాడు మరొకరు లేరు. మ్యాచ్ కు 16 సిక్సులు కొట్టిన సూపర్ హిట్టర్లు మాత్రం ఉన్నారు.
 
రోహిత్ శర్మ, క్రిస్ గేల్, డివిలియర్స్ వంటి బ్యాట్స్ మెన్ మ్యాచ్ కు  16 చొప్పున సిక్సులు  కొట్టారు. తద్వారా అత్యధిక సిక్సులు  కొట్టిన ఘనతను జాయింటుగా తమ పేర్ల మీద కలిగి ఉన్నారు. అయితే వారి ముగ్గురి రికార్డునూ బద్ధలు కొడుతూ పదిహేడు  సిక్సులు  కొట్టాగు  మోర్గాన్.

ఈ మ్యాచ్ లో 71 బంతులు ఆడిన ఆ ఇంగ్లిష్ క్రికెటర్ 148 పరుగులు చేశాడు!
Tags:    

Similar News