తనపై కక్ష సాధిస్తున్నారంటున్న ఎర్రబెల్లి..!

Update: 2015-05-25 06:53 GMT
అధికార పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నాడు తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం తన విషయంలో నిర్లక్ష్యం చూపుతోందని.. కావాలనే నిధులు కేటాయించడం లేదని  ఆయన అంటున్నాడు. తెలంగాణ  మంత్రుల ముందే ఆయన ఈ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వారినే సూటిగా నిందించాడు.

    వరంగల్‌ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో సహా ఎమ్మెల్యే హోదాలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో అధికార పార్టీపై దుమ్మెత్తిపోశాడు.

    జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు దాదాపు ముప్పై కోట్ల రూపాయల వరకూ అభివృద్ధి నిధులు ఇచ్చారని.. అయితే తన నియోజకవర్గానికి నాలుగున్నర కోట్లరూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకొన్నారని ఎర్రబెల్లివ్యాఖ్యానించాడు.

    తను ఈ విషయంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానని..పూర్థి స్థాయిలో నిధులు కేటాయింపుకు ఆయన ఒప్పుకొన్నాడని.. అయితే కొంతమంది అడ్డుపడి నిధులు అందకుండా చూశారని ఎర్రబెల్లి ఆరోపించాడు. ఇలా అడ్డుకొన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరేనని ఆరోపించడంతో.. తెరాస పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు.

    తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.


Tags:    

Similar News