పోల‌వ‌రం నిధులు...ఓ గంద‌ర‌గోళం!

Update: 2016-12-27 08:01 GMT
పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు తొలి విడత రుణం కింద రూ.1981 కోట్లు అందజేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.అయితే అదే స‌మ‌యంలో కొత్త సందేహాలు - చ‌ర్చ‌లు మొద‌లు అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు 42 వేల కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏ మూలకు సరిపోతాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇంతవరకు రూ.3881 కోట్లు విడుదల చేసింది. రెండు దశలుగా రూ. 900 కోట్లు గ్రాంట్లుగా విడుదల చేసిన కేంద్రం తాజాగా రూ.1981 కోట్ల చెక్కును నాబార్డు రుణంగా విడుదల చేసింది. 2019 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, కేంద్రం విడుదల చేస్తున్న నిధులు లేదా రుణం అందుకు అనుగుణంగా కనిపించడంలేదు. సుమారు 42 వేల కోట్ల అంచ‌నాల ప్రాజెక్టుకు ప్ర‌స్తుతం ఇస్తున్న నిధులు ఏ రీతిలో స‌రిపోతాయ‌ని అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి. అయితే ఈ విష‌యంలో ఏపీ లెక్క‌లు వేరే ఉన్నాయ‌ని అంటున్నారు.

పోల‌వ‌రం నిర్మాణం విష‌యంలో ప‌లు విడ‌త‌లుగా కేంద్ర ఇస్తున్న నిధులు ఏమూలకూ చాలవని తెలిసినా ముందు ప్ర‌స్తుతం ఇస్తున్న వాటిని తీసుకుని, తర్వాత కొత్త అంచనాలతో కేంద్రాన్ని సంప్రదించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్క‌డే మ‌రో సందేహం వెలువ‌డుతోంది. నాబార్డు ద్వారా రుణంగా ఇచ్చినా తామే భరిస్తామని కేంద్రం చెబుతున్నా, అధికారికంగా నాబార్డ్‌ తో ఒప్పందం లేదంటున్నారు. అందువల్ల చట్టబద్ధతలేని కేంద్రం మాటలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత రూ.16,010 కోట్ల అంచనాకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తంలో అప్పటికే రూ.5135 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగా - మిగిలిన దాదాపు రూ.11 వేల కోట్లు తాము భరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2014 ఏప్రిల్ నుంచి జరిగిన ఖర్చును మాత్రమే భరించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా మొద‌టి విడ‌త నాబార్డు రుణం సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రపంచంలోనే అతిత్వరగా పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసిన రికార్డును సొంతం చేసుకుంటామన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరువును అధిగమించొచ్చని చెప్పారు. ఈ నెల 30న పోలవరం కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తామని, అత్యంత ప్రధానమైన స్పిల్‌ వే - డయాఫ్రం వాల్‌ నిర్మాణం డిజైన్లకు కేంద్ర జల సంఘం నుండి అనుమతులు లభించాయని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత నీటి కోసం తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో తగాదాలు పడుతున్నామని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News