భట్టి ఇంటికి ఈటల ఎందుకు వెళ్లినట్లు? ఆ 40 నిమిషాలు ఏమైంది?

Update: 2021-05-12 04:16 GMT
తెలంగాణ రాజకీయంలో ఆసక్తికర అడుగు పడింది. లోపల ఏమైందో కానీ.. గులాబీ జెండా ఓనర్లమని బాజాప్తా ప్రకటించిన ఈటల రాజేందర్ ను అవమానకర పరిస్థితుల్లో కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం.. తదనంతర పరిణామాల గురించి తెలిసిందే. తన మీద చర్యల కత్తితో వేట్లు వేస్తున్నా.. మౌనంగా ఉంటున్న ఈటల రాజేందర్.. తొలిసారి ఒక అడుగు ముందుకు వేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన సమయంలో తన బలం ఏమిటన్న విషయాన్ని చూపించేందుకు 500 -600 కార్ల భారీకాన్వాయ్ తో తన నియోజకవర్గానికి వెళ్లారు.

ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన.. సీఎం కేసీఆర్ మీద కానీ.. తెలంగాణ ప్రభుత్వం మీద కానీ ఆయన తొందరపాటు వ్యాఖ్యలు చేయటం లేదు. దీంతో.. ఈటల వెనక్కి తగ్గారని కొందరు.. కాదు గుంభనంగా ఉన్నారని మరికొందరు ఇలా ఎవరికి వారు వారికి తోచిన కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. కీలక అడుగు వేశారు ఈటల.

మంగళవారం మధ్యాహ్న వేళలో శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని ఆయన భట్టి నివాసానికి వెళ్లిన ఈటల దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కావటం.. మంతనాలు జరపటం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో వారేం మాట్లాడుకున్న విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారంరాలేదు. కాకుంటే.. తాజా రాజకీయ పరిణామాలు..కరోనా తీవ్రత మీద ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లుగా భావిస్తున్నారు.

తనతో భేటీ సందర్భంగా ఈటలను కాంగ్రెస్ పార్టీలో రావాల్సిందిగా భట్టి కోరినట్లు తెలిసింది. దీనికి ఈటల సానుకూలంగా స్పందించారని.. సమయం కోసం ఎదురుచూద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఓవైపు తెలంగాణ మంత్రివర్గసమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఇంచుమించుగా భట్టి ఇంటికి ఈటల వెళ్లి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇన్నాళ్లు కామ్ గా ఉన్న ఈటల.. వేసిన మొదటి అడుగు ఆసక్తికరంగా మారటంతో పాటు.. రాజకీయ వర్గాల్లో చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News