హుజూరాబాద్ ఉప పోరులో కేసీఆర్ ఖర్చు రూ.500కోట్లు? ఎవరు చెప్పారంటే?

Update: 2021-10-31 04:35 GMT
ఇటీవల కాలంలో మరెప్పుడూ.. మరెక్కడా జరగని రీతిలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత.. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ.. ఆయన ఆగ్రహానికి గురై పదవులు కోల్పోయిన ఆయన తాజా ఉప ఎన్నికలో తన సత్తా చాటటమే కాదు.. కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ కొట్టున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటివేళ.. ఈటల మాట్లాడిన మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నిక కోసం కేసీఆర్ భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని.. సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ఇంత భారీగా ఖర్చు చేసినా హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని కాపాడుకోవాలని భావించారన్నారు. వందలాది పోలీసుల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని.. చివరకు డ్రైవర్లు.. పీఏలను కూడా కోవర్టులుగా వాడుకొని నీచ రాజకీయాలు చేశారన్నారు.

హుజూరాబాద్ పరిస్థితిని అప్రకటిత ఎమర్జెన్సీగా మార్చిన వేళ.. దీనిపై ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఓటుతో చెప్పారన్నారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమన్న ఆయన.. 'హుజూరాబాద్ ప్రజలు చరిత్రను తిరగరాశారు. కేసీఆర్ కుట్రల్ని అర్థం చేసుకున్నారు. డబ్బులు పంచి.. అసత్య వాగ్దానాలు చేశారు’ అంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఉప పోరులో విజయం తనదేనన్న ధీమా ఈటల మాటల్లో వినిపించటం గమనార్హం. మరి.. ఓటర్ల తీర్పు ఏం చెప్పారన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
Tags:    

Similar News