ఎవరికీ పట్టని రైతు

Update: 2015-03-19 05:35 GMT
అన్నదాత అనే పదానికి అర్థం ఎవరికీ కానీవాడు అని మార్చుకోవాలేమో! అతిశయోక్తిగా ఉన్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి అన్నం పెడుతున్న రైతుకు పొలంలో వేస్తున్న పంటలు ఎక్కువ సందర్భాల్లో నష్టాలనే మిగుల్చుతున్నాయి. ఈ నిజాలు తెలిసిన పాలకులు, అధికారులు వారికేం చేయలేకపోతున్నారు. జీవన పోరాటంలో విసిగి వేసారిన బలిదానం చేసుకుంటున్న రైతులు ఎందరో. అలాంటి వారి కుటుంబాలకు అందించే పరిహారం లోనూ ప్రభుత్వాలు ఎక్కడ లేని అన్యాయానికి పాల్పడుతున్నాయి.
అసెంబ్లీలో పద్దులపై చర్చ జరుగుతుండగా తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచబోమని కరాఖండిగా చెప్పారు. గతంలో ఉన్న పరిహారాన్నే కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఆత్యహత్యలు ఆపడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన వివాదాస్పదం అవుతోంది.ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం అయినవారికి, కాని వారికి పెద్ద ఎత్తున వరాలు ప్రకటించింది. తనను కలిసేందుకు వస్తున్న సంఘాలన్నింటికీ రెండు మూడు కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం పీఆర్సీ, పార్టీ నేతలందరికీ కేబినెట్ హోదా, ఎపుడో తప్ప కష్టించని జెడ్పీ చైర్మన్ లకు నెలకు లక్ష జీతం, జెడ్పీటీసీలు, ఇతర ప్రతినిధులకు నెలకు పదివేల రూపాయలు, తదితర బొనాంజాలు కేసీఆర్ ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. పైగా... వీళ్లలో చాలా మందికి పక్క ఆదాయాలు ఉంటాయి. 
రైతు కంటే శ్రమించే వారెవ్వరూ లేరన్నది అక్షరసత్యం. అతనికి పొలమే దిక్కు. నీటి చినుకే దేవుడు. అలాంటి అన్నదాత జీవన సమరంలో ఓడి విగత జీవి అయితే రోడ్డున పడిన ఆయన కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కూడా కనికరించకుంటే... ఇక అంతకంటే ఘోరం ఏముంటుంది? మిగతా వాళ్లందరికీ నెలానెలా ఇచ్చే జీతాలు పెంచడానికి డబ్బులున్న సర్కారు.. జీవితంలో అన్యాయమైన రైతు కుటుంబాన్ని ఒక్కసారి చిన్నసాయం చేసి ఆదుకోవడానికి ఎందుకు చేతులు రావడం లేదు?  పాపం..అన్నదాత బ్రతికి ఉన్నా..మరణించినా ఎవరికీ కానివాడే !!
Tags:    

Similar News