అదేంది ఈటెల‌.. మీరు బ‌క్క పేదోళ్లా!

Update: 2017-11-15 07:53 GMT
వెనుకా ముందు చూసుకుంటున్నారో లేదో కానీ అదే ప‌నిగా చేస్తున్న అప్పుల వ్య‌వ‌హారంపై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు మాత్రం అప్పులు చేయ‌టం కూడా త‌ప్పేనా అంటూ స‌మ‌ర్థించుకుంటోంది. అప్పుల‌తోనే అభివృద్ధి అంటూ స‌రికొత్త భాష్యాన్ని చెబుతోంది.

మాట్లాడ‌టం రావాలే కానీ.. ఏ విష‌యాన్నైనా.. అదెలాంటిదైనా స‌రే స‌మ‌ర్థించుకోవ‌చ్చ‌న్న భావ‌న మంగ‌ళ‌వారం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన తీరును చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. అర‌వైఏళ్ల ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ వాటా కింద వ‌చ్చిన అప్పులు రూ.69.47వేల కోట్ల రూపాయిలు అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అప్పులు ఏకంగా రూ.1.35 ల‌క్ష‌ల‌కు చేర‌టం.. వ‌చ్చే మార్చి నాటికి ఈ అప్పులు రూ.2.20 ల‌క్ష‌ల కోట్లు కావ‌టంపై విప‌క్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి.

దీనికి ఈటెల సింపుల్ గా తీసిపారేశారు. అప్పుల గురించి అన‌వ‌స‌ర ఆందోళ‌న ఎందుక‌న్న‌ట్లుగా తేల్చేసి ఈటెల ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. తాను బ‌క్క పేదోడ్ని అని.. త‌న మీద వంద ప్ర‌శ్న‌లు అడుగుతారా? అంటూ ఎదురుదాడి మొద‌లెట్టారు చూసేందుకు సింఫుల్ గా.. బ‌క్కోడి మాదిరి ఉండే ఈటెల రాజేంద‌ర్ ఆర్థికంగా చాలా గ‌ట్టోడ‌న్న విష‌యం కొంద‌రికే తెలుసు.

ఆయ‌న‌గారికి ఉన్న ఫ్రౌల్టీ వ్యాపారం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఫౌల్ట్రీ ఫాం బిజినెస్ ఉన్న కొద్ది మందిలో ఈటెల రాజేంద‌ర్ ప్ర‌ముఖుడు. వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ సింఫుల్ గా ఉండ‌టం ఈటెల‌కు అల‌వాటు. సింఫుల్ గా క‌నిపించే త‌న‌ను తాను పేదోడ్ని అంటే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నుకున్నారో.. తన వ్యాపారం గురించి తెలీద‌నుకున్నారో కానీ.. అల‌వోగా త‌న పేద‌రికాన్ని చెప్పేశారు. అత్తారింటికి దారేది సినిమాలో కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేద మాట‌లు మాట్లాడితే.. ఆ ప‌క్క‌నే ఉన్న ఎంఎస్ నారాయ‌ణ క్యారెక్ట‌ర్ మీరు క‌ష్టాల్లో ఉంటారంటే అంబానీ అడుక్కుతింటున్న‌ట్లు లెక్క అన్న‌ట్లుగా..  ఈటెల పేదోడైతే.. అస‌లుసిస‌లు పేదోళ్ల‌కు ఇంకేం పేరు  పెట్టాలో..?
Tags:    

Similar News