పండుగ వస్తున్నా జీతాలేవి.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉసూరు!

Update: 2023-01-12 06:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ ఉద్యోగుల వెతలు తీరడం లేదు. ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతి సమీపించినా ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పడలేదని సమాచారం. జనవరి 10 నాటికి కేవలం 30 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు ఇచ్చిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి ఈ దిశగా కార్యాచరణ చేపడతామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

నెలంతా కష్టపడి పనిచేసినా తమకు జీతాలివ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. మరోవైపు ప్రజలకు మాత్రం వివిధ పథకాల కింద ప్రతినెలా ఏదో ఒక లబ్ధిని ప్రభుత్వం చేకూరుస్తూనే ఉందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు రూ.355 కోట్లు విడుదల చేశారని గుర్తు చేస్తున్నారు.

ఉద్యోగులకు 2018 జూలై, 2019 జనవరి డీఏ బకాయిలు చెల్లించాలని చెబుతున్నారు. వీటి బకాయిలను పాత పింఛను విధానంలో ఉన్నవారికి జీపీఎఫ్‌లో జమ చేసి, సీపీఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు నగదు రూపేణా చెల్లించాల్సి ఉందని అంటున్నారు. ఇవేవీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపించి, జీతాల నుంచి ఆదాయపన్ను మినహాయించేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2022 జనవరి, జులై నెలల్లో చెల్లించాల్సిన డీఏ బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదని అంటున్నారు.

అదేవిధంగా సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు రూపేణా 90% చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ బకాయిలు రూ.3వేల కోట్ల వరకు ఉండగా.. మిగతా ఉద్యోగులకు చెల్లించాల్సినవి రూ.10వేల కోట్ల వరకు ఉన్నాయని ఉద్యోగులు వివరిస్తున్నారు.

జీపీఎఫ్, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు, క్లెయిముల బిల్లులు రూ.1,600 కోట్లకుపైగా పెండింగులో ఉన్నాయని అంటున్నారు. వీటన్నింటినీ గతేడాది ఏప్రిల్‌ నాటికి క్లియర్‌ చేస్తామని చర్చల్లో మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ రాకపోవడంతో.. పిల్లల పెళ్లిళ్లనూ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

సంక్రాంతి పండుగ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషమనేది లేదని ఉద్యోగులు అంటున్నారు. ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను ఇబ్బంది పెడుతోందని ఉద్యోగ సంఘాల భావనగా ఉందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News