జైట్లీ చెప్పిందిదే; ఉత్త ఇస్తరాకు..మంచినీళ్లు

Update: 2016-07-29 14:32 GMT
ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఏపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై గురువారం హాట్.. హాట్ గా చర్చసాగి.. అది కాస్తా శుక్రవారం కూడా కంటిన్యూ కావటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పార్టీలకు చెందిన నేతలంతా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విస్పష్టంగా చెప్పటమే కాదు.. ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. నాడు సభలో ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చటం సరైన పద్ధతి అంటూ చెప్పటం కనిపించింది. సభ్యుల ప్రసంగాల తర్వాత వారు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రశాంతంగా.. ఎలాంటి టెన్షన్ లేకుండా.. తాపీగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని అరుణ్ జైట్లీ చెప్పేశారు. సూటిగా స్పష్టంగా తన వైఖరిని స్పష్టం చేయని ఆయన మాటల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘‘ఉత్త ఇస్తరాకు.. మంచినీళ్లు’’ అని చెప్పాలి. ప్రత్యేక హోదా మీద ఎలాంటి హామీ ఇవ్వకపోవటమే కాదు.. ఈ మధ్యన పెంచిన పన్నుల వాటాతో ఏపీ బాగుపడిపోతుందని.. కొన్ని సమస్యలకే కాలమే చక్కటి మందు అన్నట్లుగా ఆయన మాటలు సాగాయి. విభజన కారణంగా ఏపీ నష్టపోయిందన్న విషయం వరకూ బాగానే ఉన్న ఆయన.. ఏపీకి సాయం చేసే విషయానికి వచ్చే సరికి.. అసలుసిసలు గుజరాతీ మార్వాడీలా వ్యవహరించారని చెప్పాలి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తమ ఇంట్లో ఆస్తులన్ని కరిగిపోతాయన్నట్లుగా ఫీలైన అరుణ్ జైట్లీ.. ఏపీకి ఇస్తే.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వాలన్న చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా మాత్రమే కాదు.. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అంశం కూడా అంత తేలికైన విషయం కాదని.. అది చాలా సున్నితమైన అంశంగా చెప్పారు. ఈ అంశాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చూస్తున్నారని.. ప్రస్తుతం ఆయన ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని.. ఈ ఇష్యూను ఆయన డీల్ చేస్తారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలుగా సాయం చేస్తున్నామని.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తున్నట్లుగా చెప్పిన యన.. ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేనందున తాము ఏమీ చేయలేమని.. హోదా గురించి ప్రధాని ప్రసంగంలో మాత్రమే ఉందని తేల్చారు. పోలవరం ప్రాజెక్టుకు.. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని.. తామిచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టిన తీరునుపరిశీలించిన తర్వాత నిధులు ఇస్తాని చెప్పారు.

విభజన కారణంగా ఏపీ హైదరాబాద్ ను కోల్పోవటం వల్లే సమస్య ఎదురైందని.. అయినా ఏపీ రాష్ట్రం కోలుకుంటుందని.. మంచిపాలన ప్రణాళికతో రెవెన్యూ లోటు నుంచి బయటపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్నింటికంటే ఒక చిత్రమైన లెక్కను జైట్లీ చెప్పుకొచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం సమైకాంధ్రకు 1.10లక్షల కోట్లు వచ్చిందని.. ఇప్పుడున్న ఏపీకి లెక్క ప్రకారం 58 శాతం అంటే రూ.64.5వేల కోట్లు రావాల్సి ఉందని.. కానీ మార్చిన లెక్కల ప్రకారం ఏపీకి రూ.2లక్షల కోట్లు వెళ్తున్నట్లుచెప్పారు. సమాఖ్య వ్యవస్థలో ఏపీతో సహా వెనుకబడిన రాష్ట్రాలన్నింటినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుందని.. కేంద్రం నుంచి చేయగలిగిన సాయమంతా చేస్తామని జైట్లీ చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. తాజా చర్చతో స్పష్టమైనదేమంటే..  ఏపీకీ ప్రత్యేకంగా ఏమీ చేయమన్న విషయాన్ని మోడీ సర్కారు తరఫున జైట్లీ రాజ్యసభ సాక్షిగా కుండబద్ధలు కొట్టారని చెప్పాలి.
Tags:    

Similar News