ఆసక్తికర భేటీ: మెగాస్టార్ తో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు

Update: 2020-03-03 06:30 GMT
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కలిశారు.. వారిద్దరూ కీలక స్థాయిలో ఉండి ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టేసి సొంత పనులు చేసుకుంటున్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి, మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భేటీ అయ్యారు. వారిద్దరూ చాన్నాళ్ల తర్వాత సమావేశమవడంతో ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్న సమయంలో వీరిద్దరూ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

నీలకంఠాపురం రఘువీరారెడ్డి హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి కలిశారు. అయితే చిరంజీవిని కలిసింది మాత్రం తన స్వగ్రామంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిసింది. అనంతపురము జిల్లా మడకశిర నియోజక వర్గం పరిధిలోని నీలకంఠాపురం రఘువీరా రెడ్డి స్వగ్రామం. రాజకీయాలు వదిలేసి రఘువీరారెడ్డి నీలకంఠాపురంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. పొలం పనులు చేస్తూ.. ఈత కొడుతూ అచ్చం పల్లెటూరి మనిషిలా కొనసాగుతున్నారు. అయితే మే 29వ తేదీన తన గ్రామంలో ఏర్పాటుచేసిన 52 అడుగుల ఎత్తు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని చిరంజీవి దంపతులను ఆహ్వానించారు.

మెగాస్టార్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో రఘువీరారెడ్డి కలిశారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా యాక్టివ్ గా లేరు. రఘువీరారెడ్డి వ్యక్తిగత పనులతో బిజీగా ఉండగా, చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరూ మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. ఈ సందర్భంగా కొంత రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవికి, లేదా రఘువీరా రెడ్డికి రాజ్యసభ అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వారిద్దరూ సమావేశం కావడం విశేషం. మరి వారిద్దరూ రాజకీయాలపై ఏమైనా చర్చించారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News