నాకు స్వార్థం ఉంటే రాజధాని అక్కడ ఉండేది : చంద్రబాబు

Update: 2020-02-05 05:52 GMT
ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం జగన్ గత ఏడాది అసెంబ్లీ సమావేశాలలో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చు అని చెప్పినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయం శరవేగంగా మారుతోంది. అలాగే మూడు రాజధానలు వద్దు అంటూ అమరావతి ప్రాంత రైతులు గత 50 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ , వైసీపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయం నుండి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్తుంది. అలాగే మండలిలో బిల్లుని సెలెక్టెడ్ కమిటీకి పంపితే మహా ఐతే మూడు రాజధానులని మరో మూడు నెలలు మాత్రమే ఆపగలరు అని వైసీపీ నేతలు అంటున్నారు.

తాజాగా వైసీపీ నేతల మాటలకి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ కి చెందిన నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ..అతి త్వరలోనే వడ్డీతో సహా తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన అమరావతి పరిరక్షణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలపై , సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే అదే వేదికపై నుండి ప్రభుత్వానికి మరో సవాల్ విసిరారు. అమరావతిపై రెఫరెండం పెట్టాలని .. అందులో జనం అమరావతిని కోరుకుంటారో.. మూడు రాజధానులకు మద్దతిస్తారో తేలిపోతుంది అని చెప్పారు. ఆ రెఫరెండంలో ప్రజలు కనుక 3 రాజధానులకు మద్దతిస్తే నేనిక మళ్లీ మూడు రాజధానుల పై నోరెత్తను అని స్పష్టం చేశారు.

తన హయాంలో జగన్ ఎక్కడ ఎటువంటి సభ పెట్టినా కూడా ప్రభుత్వం అడ్డుపడలేదు అని , ఒకవేల మేము అప్పుడు అడ్డుపడి ఉంటే జగన్ అన్ని సభలు నిర్వహించే వారా అంటూ ప్రశ్నించారు. ఆయన పాలనాతీరు చూస్తుంటే తిక్కో, ఉన్మాదమో, సైకో లక్షణాలో అర్థం కావడం లేదు అని అన్నారు. అలాగే టీడీపీ సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదన్న చంద్రబాబు.. ఆఖరికి ధర్నా శిబిరాన్ని కూడా తగలబెడుతారా అని ప్రశ్నించారు. తాను ఒక్క పిలుపునిస్తే రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారని, అలాంటివారి కోసం ఎన్ని చేసినా తక్కువే అని , రాజధాని మార్చి వారి పొట్ట కొట్టవద్దు అని హితవు పలికారు.

అమరావతిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని.. అదే నిజమైతే విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. అమరావతిలో భూ అక్రమాలు జరిగితే విచారణ జరిపించాలన్నారు. బినామీల పేరుతో కొట్టేసే అలవాటు తనకు లేదన్నారు. తాను ఎక్కడా స్వార్థం చూసుకోలేదని.. ఒకవేళ తాను స్వార్థపరుడినే అయితే రాజధానిని తిరుపతిలో పెట్టేవాడినని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దికి తాను కృషి చేశానని చెప్పారు. ఒక పక్క అమరావతి లో 35 వేల ఎకరాలు స్వచ్ఛందం గా రైతులు భూములిస్తే అవి కాదని, విశాఖలో 6,111 ఎకరాల ఎస్సీ భూములను బలవంతం గా లాక్కోవడానికి తెగబడుతున్నారు. మరో 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి అభివృద్ధి చేస్తాననడం విడ్డూరంగా ఉందంటూ అప్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.


Tags:    

Similar News