మోడీ..స్మృతీల‌ను ఆ మాట అనేసిన కాంగ్రెస్ నేత‌లు

Update: 2015-12-28 09:28 GMT
రాజ‌కీయాల్లో మాటా.. మాటా అనుకోవ‌టం తిట్టుకోవ‌టం మామూలే. ఈ మ‌ధ్య‌కాలంలో కొన్ని రాష్ట్రాల్లో బూతులు తిట్టుకోవ‌టం అల‌వాటుగా మారింది. ఇలాంటి హ‌ద్దులు దాటేస్తూ.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నేత‌ల వైఖ‌రి విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే.. ఎలాంటి మాట‌లు అన‌కూడ‌దో.. ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌కూడ‌దో.. ఆ లక్ష్మ‌ణ‌రేఖ‌ను పూర్తిగా దాటేసిన ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అసోం కు చెందిన ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు మాజీ మంత్రి నీల్ మ‌ణి సేన్ దెకా.. మ‌రో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మిలు వేర్వేరుగా ప్ర‌ధాని మోడీ.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీల‌పై దారుణ ఆరోప‌ణ‌లు చేశారు.

ఒక బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన నీల్ మ‌ణి సేన్ దెకా.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హ‌త‌ల‌ను ప్ర‌శ్నించి.. అనంత‌రం ఆమెపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాని మోడీకి స్మృతి రెండో భార్య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల్నే కాంగ్రెస్ ఎమ్మ‌ల్యే రూప్ జ్యోతి కుర్మి కూడా చేయ‌టం ఈ వ్య‌వ‌హారం హీటెక్కించింది.

ఇంత చౌక‌బారు వ్యాఖ్య‌లు ఎలా చేస్తారంటూ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ నేత‌లు ఇంత సిగ్గుమాలిన వ్యాఖ్య‌లు చేస్తుంటే.. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఏం చేస్తుంద‌ని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక మ‌హిళ అధినేత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న పార్టీకి చెందిన నేత‌లు ఇద్ద‌రు కేంద్ర‌మంత్రి మీదా.. ప్ర‌ధాని మీద ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ల‌క్ష్మ‌ణ రేఖ‌ను పూర్తిగా దాటేసి ఇష్టారాజ్యంగా మాట్లాడేసిన ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌ల‌పై కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. మ‌రి.. దీనిపై కాంగ్రెస్ అధినాయ‌కత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో..?
Tags:    

Similar News