వీరప్పన్ ‘స్పాట్’ గురించి చెప్పుకొచ్చిన పోలీస్

Update: 2016-06-08 08:36 GMT
ఇప్పటి తరానికి వీరప్పన్ అంటే రాంగోపాల్ వర్మ తీసిన సినిమానే గుర్తుకు వస్తుంది. అతగాడి దుర్మార్గం.. అంతటి కర్కశత్వం ఎవరూ మర్చిపోలేరు. రెండు మూడు జనరేషన్స్ ముందు వారంతా వీరప్పన్ అంటే ఉలిక్కిపడతారు. ఇక కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో అయితే వణికిపోతారు. 20 ఏళ్ల పాటు రాష్ట్రాలకు కొరకరాని కొయ్యిలా మారి.. గంధపు చెక్కలు.. ఏనుగు దంతాల్ని స్మగ్లింగ్ చేస్తూ.. తనకు అడ్డు వచ్చిన అధికారుల్ని..సామాన్యుల్ని చంపేసిన వీరప్పన్ ను హతమార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ.. అవేమీ సక్సెస్ కాలేదు.

180 మందిని దుర్మార్గంగా చంపేసిన వీరప్పన్ ను మట్టుబెట్టేందుకు.. 2003లో విజయకుమార్ అనే అధికారిని టాస్క్ ఫోర్స్ అధినేతగా నియమించారు. వీరప్పన్ ను మట్టుబెట్టటమే అతడి పని. ఆపరేషన్ కుకూన్ పేరిట పక్కా ప్లాన్ ను అమలు చేసిన ప్లాన్ ఎట్టకేలకు వర్క్ వుట్ అయ్యింది. ఈ ఆపరేషన్ లో భాగంగా విజయకుమార్ ఒక కానిస్టేబుల్ ను వీరప్పన్ ముఠాలో సహాయకుడిగా చేర్చాడు. తక్కువ కాలంలోనే వీరప్పన్ కు కుడిభుజంగా మారాడు. ఇలాంటి సమయంలోనే వీరప్పన్ కంటిచూపు తగ్గింది.

అడవిలో అధిపత్యం కొనసాగాలంటే కంటిచూపు తప్పనిసరి అన్న మాటను చెప్పి.. అతడ్ని ఒప్పించిన సదరు పోలీస్ కానిస్టేబుల్ పక్కా ప్లాన్ వేశాడు. ముందుగా అనుకున్న ప్లాన్ లో భాగంగా.. 2004 అక్టోబర్ 10న వీరప్పన్ అడవి నుంచి బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముందుగా అనుకున్నప్లాన్ లో భాగంగా.. అడవి నుంచి బయటకు వచ్చిన వీరప్పన్ ను ధర్మపురి జిల్లా పాప్పారపట్టి గ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడున్న పోలీస్ అంబులెన్స్ లో వీరప్పన్.. అతని అనుచరులు ఎక్కారు.

వాహనం కొంతదూరం ప్రయాణించిన తర్వాత వెల్లదురైతో పాటు.. డ్రైవర్ గా నటించిన శరవణన ఆ వాహనానికి తాళాలు వేసి అడవిలోకి పారిపోయాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరప్పన్ మీద.. ఆయన అనుచరుల మీద తూటాల వర్షం కురిపించారు. దీంతో.. వీరప్పన్ కుప్పకూలిపోగా.. తీవ్రంగా గాయపడిన అతడి అనుచరులు మరణించారు. దీంతో.. దశాబ్దాల తరబడి సాగుతున్న వీరప్పన్ వేట ముగిసినట్లైంది. అత్యంత క్రూరుడైన వీరప్పన్ ను ఎలా మట్టుబెట్టిందన్న విషయాన్ని పోలీసు అధికారి అయిన విజయకుమార్ తన పుస్తకంలో వివరంగా వెల్లడించారు.
Tags:    

Similar News