మాజీ సీఎస్ సంచలనం... సుప్రీం జడ్జీల చేతుల్లో రాజధాని భూములా?

Update: 2020-02-03 04:17 GMT
ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లె వేదికగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన సభకు హాజరైన సందర్భం గా అజేయ కల్లం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెను కలకలమే రేపనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా అజేయ కల్లం ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ సీఎం లక్ష్యం. ‘వికేంద్రీకరణ’ అనేది పరిణామక్రమంలో ఒక ప్రగతి సిద్ధాంతం. అభివృద్ధి అంతా ఒకేచోట ఉండాలన్న ఆలోచన కరెక్టు కాదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా తీర్చిదిద్దుతాం. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచనతోనే వికేంద్రీకరణ. తెలంగాణ, రాయలసీమ వెనుకబడి ఉన్నాయని, కృష్ణా, గుంటూరు లు రాజధాని ఏర్పాటుకు అనుకూలం కాదని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఆ భూములన్నీ రైతుల చేతుల్లో కన్నా పెద్దపెద్దవాళ్లు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. సుప్రీంకోర్టు జడ్జిలు, అడ్వొకేట్ జనరల్స్, కొంతమంది పత్రికాధి పతుల చేతుల్లో ఈ బినామీ భూములు ఉన్నాయి’’ అని ఆయన సంచలనాలకే సంచలనంగా నిలిచే వ్యాఖ్యలు చేశారు.

రాజధాని భూములను వాటి యజమానులను బెదిరించి టీడీపీ నేతలు కారు చౌకగా కొట్టేశారని జగన్ అండ్ కో చాలా రోజుల నుంచే చెబుతోంది. అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదిక గానే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ భూదందాలో అడ్వొకేట్ జనరళ్లతో పాటు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు కూడా ఉన్నారంటూ అజేయ కల్లం చేసిన కామెంట్స్ పెను కలకలం రేపనున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News