ట్రంప్‌ పై కొత్త ఆరోప‌ణ చేస్తున్న అమెరిక‌న్లు

Update: 2017-08-15 06:29 GMT
``అతివాద గ్రూపులు - ఉన్మాదులు చీకటిలో ఉండేవారు. కానీ, ఇప్పుడు ఈ దుష్ట శక్తులు బయటకు రావడానికి కారణముంది. వీరికి బలాన్నిచ్చే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు`` వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా నిలిచే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై శ్వేత‌వ‌ర్ణం క‌లిగిన‌ అమెరిక‌న్ల తాజా ఆరోప‌ణ ఇది. ఇందుకు కార‌ణం తాజాగా జ‌రుగుతున్న వివాద‌మే. స్మారక చిహ్నం రాబర్ట్‌ ఇ.లీ విగ్రహాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా నుంచి తొలగించాలని స్థానిక కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. తాము గర్వకారణంగా భావించే స్మారక చిహ్నాన్ని తొలగించవద్దంటూ శ్వేతజాతి దురహంకారులు 'యునైట్‌ ద రైట్‌' పేరిట భారీ ప్రదర్శన చేపట్టారు. ఇది క్రమంగా యూరోపియన్‌ - ఆఫ్రికన్‌ వలసదారులపై విద్వేషంగా మారింది. 'అమెరికాను తిరిగిచేజిక్కించుకుందాం' అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో వీరి నిరసనను వ్యతిరేకిస్తూ మరోవర్గం 'అమెరికన్లంతా ఒక్కటే' అనే నినాదంతో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించింది. ఫలితంగా రెండు గ్రూపుల మధ్య స్వల్ప స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్త వాతావరణం తగ్గిందనుకున్న సమయంలో కారు ప్రమాదం చోటుచేసుకొని ఒక మహిళ మృతి చెందింది.

వర్జీనియా ఘటన అమెరికాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 'మేక్‌ అమెరికా గ్రేట్ అగెయిన్‌' అన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం, దేశంలో జాతీయ ఉన్మాదులకు మరింత బలాన్నిచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ఎన్నికల ప్రచార తీరు ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని, దాని ఫలితంగానే ఇలాంటి ఉన్మాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయని డెమొక్రట్లు - రిపబ్లికన్లు ట్రంప్‌ ను విమర్శించారు. శనివారం నాటి జాతీయ ఉన్మాదుల నిరసన ర్యాలీకి కేకేకే - నియో-నాజీ - ఆల్టర్‌ నేటివ్‌ రైట్‌ - ఇతర జాతీయ అతివాద గ్రూపుల నాయకులు నేతృత్వం వహించారు. వీరంతా మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చార్లెట్స్‌విల్లే మేయర్‌ మైక్‌ సిగర్‌ మాట్లాడుతూ చీకటిలో ఉండే అతివాద గ్రూపులు - ఉన్మాదులు బయటకు రావడానికి కారణం వీరికి బలాన్నిచ్చే వ్యక్తి అధ్యక్షుడిగా ఉండ‌ట‌మే అని మండిప‌డ్డారు. `కు క్లక్స్‌ క్లాన్‌` (కేకేకే) అతివాద గ్రూపు మాజీ నాయకుడు లూసియానా రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ నాయకుడిగా ఉన్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కు మద్దతుగా ప్రచారం చేసిన వారిలో ప్రముఖుడైన డేవిడ్‌ డ్యూక్ శ్వేతజాతీయుల నిరసన ర్యాలీకి నేతృత్వం వహించిన సంద‌ర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ``ట్రంప్‌.. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వు గెలిచింది మా(శ్వేతజాతీయు ల) ఓట్లతోనేకానీ, ఆ మార్క్సిస్టు - లెఫ్టిస్టుల ఓట్లతో కాదన్న విషయం గుర్తుంచుకో` అని అన్నారు. మ‌రోవైపు చార్లెట్‌ విల్‌ లో విద్వేష ప్రదర్శనలు - హింస చోటుచేసుకోవడంపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యక్షుడు ట్రంప్‌ శ్వేతసౌధంలో మాట్లాడుతూ శాంతిని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'విద్వేష దాడులు ఖండిస్తున్నాను. మనమంతా ఒక్కటే. అమెరికన్లలో బేధాలు లేవు. సహనం పాటించండి. శాంతివహించండి.' అని వ్యాఖ్యానించారు. కాగా, వివిధ పేర్లతో దేశంలో 1600 వరకు జాతీయ ఉన్మాద గ్రూపులు ఉన్నాయన్నది ఓ అంచనా. ఆన్‌ లైన్‌ లో సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌ - ట్విట్టర్‌ లలో ఈ గ్రూప్‌ సభ్యులు తమ భావజాలాన్ని విస్తరింపజేస్తారు. వామపక్ష భావాల పట్ల వ్యతిరేకత - ఇస్లామోఫోబియా ను సృష్టించటం ఈ గ్రూప్‌ ల ప్రధాన లక్ష్యంగా చెప్తుంటారు.
Tags:    

Similar News