ఉద్యమకారులమని చెప్పుకొని తిరగమాకండి....!!

Update: 2019-09-19 05:47 GMT
టీఆర్ ఎస్ పార్టీ అన్నంతనే ఉద్యమ పార్టీగా దానికున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు తాజాగా అసెంబ్లీ లాబీల్లో చేసిన ఉపదేశం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. షాకింగ్ గా మారింది. టీఆర్ ఎస్ నేతల్లో ఎవరిని కదిలించినా.. తమ మాటల్లో తమ ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ గురించి తరచూ చెబుతుంటారు. బీటీ బ్యాచ్ ఎంట్రీతో ఇది మరింత ఎక్కువైంది.

అయితే.. పార్టీలో మంత్రి పదవులు మొదలుకొని.. కీలకస్థానాలన్ని బీటీ బ్యాచ్ కే లభిస్తున్న వేళ.. మొదట్నించి పార్టీలో ఉన్న గులాబీనేతల్లో నిరాశ వెంటాడుతోంది. ఉద్యమంలో ఎంత కీలకంగా వ్యవహరిస్తే ఏముంది? అందుకోసం ఎంత కష్టపడితే మాత్రం లాభం ఏమిటి? అన్న మాటలతో పాటు.. బీటీ బ్యాచ్ కు పార్టీలో లభిస్తున్న ప్రాధాన్యతపై పలువురు గుర్రుగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అసెంబ్లీ లాబీల్లో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీఆర్ ఎస్ మాజీ మంత్రి ఒకరు హైదరాబాద్ నగర నేతకు ఇచ్చిన ఉపదేశం పలువురిని ఆకర్షించేలా చేసింది. అరే.. అదే పనిగా ఉద్యమకారులమని చెప్పుకొని తిరగమాకండి. జీవితం మీద దృష్టి పెట్టండంటూ హితబోధ చేశారు.

సదరు మాజీ మంత్రి మాటకు అవాక్కు అయ్యాడా ఉద్యమ నేత. అదే సమయంలో వారి వైపుగా ఒక మంత్రి వచ్చారు. దీంతో సదరు మాజీ మంత్రి మాట్లాడుతూ.. అరే.. వీళ్లకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఉద్యమకారులకు ఏం ప్రయోజనం జరిగిందో వీళ్లకు ఇప్పటికి అర్థం కావట్లేదే.. నువ్వైనా చెప్పవే అంటూ వ్యాఖ్యానించారు.

సదరు మంత్రి మాత్రం అస్సలు స్పందించకుండా వెళ్లిపోతూ.. సదరు మాజీ మంత్రి వైపు ఒక నమస్కారం పెట్టి (నన్ను వదిలేయ్ బాబు అన్నట్లు) వెళ్లిపోవటం గమనార్హం. ఒకప్పటి ఉద్యమ పార్టీలో జరిగిన ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తమది ఉద్యమ పార్టీ అని.. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారటమంటే ఇదేనేమో? మొత్తానికి కేసీఆర్ కోరుకున్నట్లే టీఆర్ ఎస్ రూపాంతరం చెందిందని చెప్పొచ్చేమో?
Tags:    

Similar News