టీడీపీకి కాపులు దూర‌మేనా..బీజేపీలోకి మాజీ మంత్రి

Update: 2019-10-03 12:09 GMT
ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి. అసలే ఘోర ఓటమితో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని నేతలు వరుసగా వీడుతూ ఇంకా కోలుకోకుండా చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీ - బీజేపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. అందులోనూ కాపు నేతలు ఎక్కువగా పార్టీకి దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి శనక్కాయల అరుణ అనుచరులతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. మరో కాపు నేత తోట నగేశ్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  

అరుణ బీజేపీలో చేరేలా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చొరవ తీసుకున్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీని బలోపేతం చేయడం కోసం.. తన సామాజిక వర్గం వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి జై కొట్టిన కాపు నేతలు ఇప్పుడు వరుసగా దూరమైపోతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీకి చెందిన పలువురు కాపు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎన్నికల ముందు అవంతి శ్రీనివాస్ - అమంచి కృష్ణ మోహన్ - మాజీ ఎంపీ తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరిపోయారు.

ఇక ఫలితాల తర్వాత అసంతృప్తితో ఉన్న కొందరు కాపు నేతలు కాకినాడలో సమావేశమై అధిష్టానం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశం తర్వాత చంద్రబాబు వారికి సర్ది చెప్పిన వినలేదు. అందులో మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్ర‌త్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజాది కూడా అదే దారి.

అటు ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు తెలిపిన వంగవీటి రాధా జనసేనపై వెళ్ళేందుకు చూస్తున్నారు. అలాగే మాజీ మంత్రి - ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పార్టీని వీడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన కూడా త్వరలో జెండా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కాపు నేతలైతే టీడీపీకి దూరం కావాలని స్ట్రాంగ్‌ గా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.


Tags:    

Similar News