అమెరికాలో తెలుగోడికి ఉరిశిక్ష‌..డౌటేన‌ట‌

Update: 2018-01-13 06:47 GMT
ఓ వృద్ధురాలు - ఆమె మనవరాలిని కిరాతకంగా హత్య చేసిన కేసులో మరణదండనకు గురైన ప్రవాస భారతీయుడు రఘునందన్ యండమూరి (32)కి ఫిబ్రవరి 23న శిక్ష అమలు డౌటేన‌ని తెలుస్తోంది. ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఆంధ్రప్రదేశ్ నివాసి రఘునందన్ హెచ్1బీ వీసాపై అమెరికాకు వెళ్లాడు. జూదం వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో 2012లో డబ్బు కోసం వెన్న సాన్వీ అనే పది నెలల పాపను కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో తనకు అడ్డు వచ్చిన పాప నాయనమ్మ వెన్న సత్యవతి (61)ని హత్య చేశాడు. పోలీసులు అరెస్టు చేసి విచారించినప్పుడు తనకు ఏ పాపం తెలియదని అన్నాడు. చివరికి - పాప ఏడుపును ఆపేందుకు ఆమెను ఒక సూట్‌ కేసులో బంధించానని చెప్పాడు. అప్పటికి మూడు రోజులు గడువడంతో పాప సూట్‌ కేసులోనే మృతి చెందింది. రఘునందన్‌ పై రెండు హత్య అభియోగాలను మోపిన పెన్సిల్వేనియా కోర్టు 2014లో అతడికి మరణశిక్ష విధించింది. దీంతో వ‌చ్చే ఫిబ్రవరి 23న శిక్షను అమలు చేయనున్నామని పెన్సిల్వేనియా అధికారులు గురువారం ప్రకటించారు.

అయితే, రఘునందన్ యండమూరికి వచ్చే నెల 23న శిక్షను అమలు చేసే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. మరణశిక్షలపై 2015లో పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వుల్ఫ్ జారీ చేసిన మారిటోరియం(నిలుపుదల) కారణంగానే రఘునందన్‌ కు శిక్షను అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నాయి. డిపార్ట్‌ మెంట్ ఆఫ్ కరెక్షన్స్ కమ్యూనికేషన్ డైరెక్టర్ సుయీమెక్‌ నాగ్టన్ మాట్లాడుతూ రఘునందన్‌ కు మరణశిక్ష అమలుపై పెన్సిల్వేనియా కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోతే తన అధికారాలను ఉపయోగించి ఈ శిక్షను వాయిదా వేస్తానని గవర్నర్ టామ్ వుల్ఫ్ చెప్పారని పేర్కొన్నారు. అయితే వచ్చే నెల 23న రఘునందన్‌ కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేయాలని గతవారం డిపార్ట్‌ మెంట్ ఆఫ్ కరక్షన్ నిర్ణయించింది.

మ‌రోవైపు గవర్నర్ టామ్ వుల్ఫ్ 2015లో మరణశిక్షలపై మారటోరియం (నిలుపుదల) విధించినట్టు స్థానిక టైమ్స్ హెరాల్డ్ పత్రిక గుర్తు చేసింది. మరణశిక్షలపై స్థానిక టాస్క్‌ ఫోర్స్ - సలహా కమిటీ అధ్యయనం చేస్తున్నాయని, వాటి నివేదిక అందేవరకు రఘునందన్‌ కు శిక్ష అమలు కాకపోవచ్చని ఆ పత్రిక అభిప్రాయపడింది. పెన్సిల్వేనియాలో 1999 తరువాత ఇంతవరకు మరణశిక్షను అమలు చేయలేదు. కాగా, ఇది అమ‌లు అయితే ఓ ప్రవాస భారతీయుడికి అమెరికాలో మరణశిక్షను అమలు చేయడం ఇదే మొదటిసారి కానుంది.
Tags:    

Similar News