క్రిస్మస్ ప్రయాణాలు.. తస్మాత్ జాగ్రత్

Update: 2021-12-20 09:59 GMT
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా కంటే అతి వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఈ మహమ్మారి కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఓవైపు డెల్టా... మరోవైపు ఒమిక్రాన్ విలయతాండవం చేస్తున్నాయి. వారం వ్యవధిలో ఎనిమిదిన్నర లక్షల మందికి వైరస్ సోకగా... 8వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ఈ వేరియంట్ పై పలు హెచ్చరికలు జారీ చేశారు.

కరోనాపై అమెరికాను అప్రమత్తం చేసే అంటువ్యాధుల నిపుణులు తాజాగా ఓ మీడియా సమావేశంలో ఒమిక్రాన్ వేరియంట్ గురించి మాట్లాడారు. ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అసాధారణ రీతిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రయాణాల వల్ల మరింతంగా విజృంభించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. రెండు డోసుల టీకా వేసుకున్న వారు సైతం ఈ వేరియంట్ బారిన పడుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికాలో వైరస్ వేరియంట్లు కోరలు చాస్తున్నాయని చెప్పారు. కొవిడ్ పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా ఇటీవల పెరిగింది. అయితే ఈ కేసులు మరింతగా పెరిగితే అమెరికావ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని చెప్పారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ప్రతీఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోసు తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు. అశ్రద్ధ చేస్తే అంతే సంగతులు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వైరస్ బారిన పడి... ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో టీకా తీసుకోనివారే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో ఇప్పటివరకు 61 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అర్హులైన వారందరికీ టీకా ఇచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. కరోనాతో ఇటీవల ఆస్పత్రుల్లో చేరిన వారిలో దాదాపు ఎనభై శాతం మంది టీకా తీసుకోనివారేనని తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం వల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. టీకాతో వైరస్ ను చాలా వరకు ఎదుర్కొవచ్చునని చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవడానికి వివిధ దేశాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఐరోపా దేశాలు చాలా అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్స్ లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇకపోతే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. బూస్టర్ డోసుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
Tags:    

Similar News