శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాహుల్ కానీ ఆ టీ తాగి ఉంటే?

Update: 2019-03-19 04:29 GMT
ఇప్పుడు చెబుతున్న‌ది తాజా వార్త కాదు. కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న‌ది. కాస్త ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం చూస్తే.. అత్యున్న‌త వీఐపీ విష‌యంలో అధికారుల నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ త‌ర్వాత అత్యంత ర‌క్ష‌ణ క‌లిగిన రాజ‌కీయ నేత‌గా కాంగ్రెస్ అధినేత రాహుల్ ను చెప్పొచ్చు. ఆయ‌న‌కు అనునిత్యం ఎస్పీజీ క‌మాండోలు రక్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తుంటారు.

ఆయ‌న ప‌ర్య‌టించే ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త చ‌ర్య‌ల్ని చేప‌డుతుంటారు. ఇక‌.. జాగ్ర‌త్త‌ల విష‌యంలో చాలానే కేర్ తీసుకుంటారు. అలాంటి వీవీఐపీ ఇటీవ‌ల‌ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు  వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తున్న స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ఆయ‌న్ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని వీవీఐపీ లాంజ్ లో కాసేపు రిలాక్స్ అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ కు స్నాక్స్.. టీ ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేశారు. రాహుల్ కు టీ క‌లిపేందుకు వినియోగించిన టీ బ్యాగ్ లు ఎక్స్ పైర్ అయిన విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించారు. మామూలుగా అయితే.. అధికారులు ఇచ్చిన టీని రాహుల్ తాగేవారు. కానీ..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒక‌రు హైద‌రాబాద్ సిటీ నుంచి ఇరానీ ఛాయ్ ను ప్ర‌త్యేకంగా తీసుకెళ్ల‌టంతో ఆయ‌న ఆ టీ రుచి చూశారు. ఆ క్ర‌మంలో ఎయిర్ పోర్ట్ లో అధికారులు ఇచ్చే టీని తీసుకోలేదు.

రాహుల్ కు టీ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ఎన్సీజీ క‌మాండోలు చెక్ చేసిన స‌మ‌యంలో.. రాహుల్ కు ఇచ్చే టీ  కోసం ఉంచిన టీ బ్యాగ్ లు ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన విష‌యాన్ని గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ‌.. రాహుల్ కాలం చెల్లిన టీ ప్యాకెట్ల‌తో చేసిన ఛాయ్ తాగి ఉంటే ప‌రిస్థితి ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ను సంధించ‌టంతో పాటు.. అందుకు బాధ్యులైన అధికారుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిసింది. ఈ వ్య‌వ‌హారం ప్రోటోకాల్ అధికారుల్లో హాట్ టాపిక్ గా మారిన‌ట్లు తెలిసింది. ఒక వీవీఐపీకి ఇచ్చే వ‌స్తువుల‌కు సంబంధించి ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. దీనిపై ఉన్న‌తాధికారులు సీరియ‌స్ గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. 
Tags:    

Similar News