ఫేస్ బుక్ సీఈవో అడ్డంగా బుక్కయ్యాడు..

Update: 2019-10-02 11:42 GMT
మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ తన సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీని దుర్వినియోగం చేసి ప్రచారం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోనే బెస్ట్ సోషల్ మీడియా ప్రత్యర్థులైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ను ఫేస్ బుక్ భారీ ధరకు కొని తనలో విలీనం చేసుకుంది. తనకు పోటీలేకుండా ఫేస్ బుక్ చేసుకుంది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 85శాతం వాటా ఫేస్ బుక్ హస్తగతం చేసుకున్నటైంది.

ఇక ఇప్పుడు ఫేస్ బుక్ కు పోటీగా చైనా సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్ ’ దూసుకొస్తోంది.దాంతోపాటు వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించి అకౌంట్లను దుర్వినియోగం చేసిందనే అపవాదుపై అమెరికా ప్రభుత్వ విచారణను కూడా  ఫేస్ బుక్   ఎదుర్కొంటోంది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ తన ఫేస్ బుక్ అంతర్గత సమావేశంలో ఉద్యోగులతో మాట్లాడిన ఆడియో ఒకటి రిలీజ్ అయ్యింది. అదిప్పుడు అమెరికాలో దుమారం రేపుతోంది.

వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి ఎలిజిబెత్ వారెన్ అధ్యక్షురాలు అయితే మనకు ప్రమాదమని.. చట్టపరమైన సవాళ్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్ అనడం కలకలం రేపింది. సంస్థను వారెన్ విచ్చిన్నం చేయాలనే ప్రయత్నాన్ని తాము గట్టిగా ఎదుర్కొంటామని జుకెర్ బర్గ్ సవాల్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో సంచలనంగా మారాయి. వారెన్.. ఫేస్ బుక్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలను టార్గెట్ చేశారని జుకెర్ బర్గ్ ఆరోపించారు. ఇక యూత్ లో పిచ్చ పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ కు పోటీగా ‘లాసో’ను లాంచ్ చేయబోతున్నట్టు ఆ ఆడియోలో జుకెర్ బర్గ్ తెలిపారు.

ఇక తనను అమెరికా అధ్యక్షురాలు కాకుండా అడ్డుకుంటామని ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్ ఆడియో విడుదల కావడంపై డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వారెన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఫేస్ బుక్ వినియోగదారుల గోప్యత హక్కులకు భంగం కలిగి అవినీతి వ్యవస్థను విస్తరిస్తోందని.. దానికి పోటీలేకుండా అన్నింటిని కొనేస్తోందని.. దాని ఆటలు సాగనివ్వమంటూ వారెన్ హెచ్చరించారు.

తన ఆడియో దుమారం రేపడంతో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. నా మాటలను ఎవరో కట్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా ఆడియో రూపొందించారని పూర్తి ఆడియో పాఠం ఇదేనని అసలు ఆడియోను విడుదల చేశారు. ఓ లింక్ ను తన ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వివాదం అమెరికాలో రాజుకుంది.
    

Tags:    

Similar News