ఫేస్‌ బుక్ చీఫ్‌... ఇద్ద‌రు కూతుళ్ల తండ్రి!

Update: 2017-08-30 07:20 GMT
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ కు ఎంత ప్ర‌త్యేకత ఉందో... ఆ సంస్థ చీఫ్ మార్క్ జుకెర్ బ‌ర్గ్‌ కు కూడా అంతే ప్ర‌త్యేక‌త ఉంద‌న్న‌ది కాద‌న‌లేని విష‌య‌మే. ఎందుకంటే... ఏం చేసినా దానికి ఓ కార‌ణాన్ని చూపే జుకెర్ బ‌ర్గ్‌... త‌న సంస్థ ఉద్యోగుల‌తో పాటు త‌న‌కు కూడా కాస్తంత వెసులుబాటు క‌ల్పించుకుంటారు. ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌దైన ప్ర‌త్యేకత‌ను చాటుకునే జుకెర్ బ‌ర్గ్‌... త‌న భార్య ప్ర‌స‌వాన్ని పురస్క‌రించుకుని స‌రికొత్త‌గా పెట‌ర్న‌టీ లీవు (పితృత్వ సెల‌వు) తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. త‌న భార్య తొలుత ఓ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా.. ఆ బుజ్జి పాపాయితో ఆడుకుంటూ, ఆ పాపాయి ఆల‌నాపాల‌నా చూసుకుంటూ... తండ్రి అంటే ఇలా ఉండాలంటూ ప్ర‌పంచానికి చాటి చెప్పారు. పితృత్వ సెల‌వు తీసుకుని జుకెర్ బ‌ర్గ్ ఎంత‌గా ఎంజాయి చేశారో నాడు మ‌నం చాలానే చెప్పుకున్నాం.

ఇదంతా గ‌త‌మైతే... ఇటీవ‌లే జుకెర్ బ‌ర్గ్ మ‌రోమారు పితృత్వ సెల‌వు తీసుకున్నారు. ఈ సారి కూడా ఆయ‌న స‌తీమ‌ణి రెండో ప‌ర్యాయం గ‌ర్భం దాల్చ‌డం, ఆమె ప్ర‌స‌వానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతోనే జుకెర్ బ‌ర్గ్ సెల‌వు తీసుకున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఆ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌డానికి ముందే... ఈ విష‌యాన్ని జుకెర్ బ‌ర్గే స్వ‌యంగా వెల్ల‌డించారు కూడా. జుకెర్ బ‌ర్గ్ రెండో ప‌ర్యాయం పెట‌ర్న‌టీ లీవు తీసుకుని చాలా రోజులే అవుతుంది క‌దా... మ‌రి ఆయ‌న నోటి నుంచి అస‌లు విష‌యం ఇంకా వినిపించ‌లేదేంటి అన్న డౌట్లు పెరుగుతున్న క్ర‌మంలో ఆయ‌నే నేరుగా రంగంలోకి దిగేశారు. త‌న‌కు రెండో బిడ్డ కూడా జ‌న్మించింద‌ని, తొలి పాప మాదిరే రెండో ప‌ర్యాయం కూడా ఆడ‌బిడ్డే పుట్టింద‌ని ఆయ‌న ప్ర‌క‌టించేశారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌తోనే స‌రిపెట్ట‌ని ఆయ‌న తాను త‌న రెండో కూతురుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో మొద‌టి పాప జుకెర్ బ‌ర్గ్ ఒడిలో కూర్చుని ఉండ‌గా, రెండో పాప మాత్రం ఆయ‌న స‌తీమ‌ణి పొత్తిళ్ల‌లో ఉంది.

తొలి సంతానం మాక్సిమా 2015లో జ‌న్మించిన‌పుడు కూతుర్ని లోకంలోకి ఆహ్వానిస్తూ త‌ల్లిదండ్రులిద్ద‌రూ ఓ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అలాగే రెండో పాప‌ను కూడా ఆహ్వానిస్తూ వారు లెట‌ర్ రాశారు. `పాప‌గా ఉండే అవ‌కాశం జీవితంలో ఒక్క‌సారే వ‌స్తుంది. భవిష్య‌త్తు గురించి ఆలోచించ‌కుండా ప‌సి వ‌య‌సును ఆస్వాదించు. నీ భ‌విష్య‌త్తు గురించి చింతించే అవ‌కాశాన్ని మాకివ్వు. నీ లాంటి పిల్ల‌ల కోసం ప్ర‌పంచాన్ని గొప్ప‌గా మార్చే అవకాశాన్ని మాకివ్వు` అని వారు లేఖ‌లో పేర్కొన్నారు. త‌మ కంటే మంచి జీవితాన్ని అనుభ‌వించే హ‌క్కు వాళ్ల కూతురి త‌రానికి ఉంద‌ని, దాన్ని నిజం చేసే బాధ్య‌త‌ను తాము నిర్వ‌ర్తిస్తామ‌ని మార్క్ దంప‌తులు తెలియ‌జేశారు.
Tags:    

Similar News