ఆపిల్‌ కు దిమ్మ‌తిరిగి పోయే కేస్ ఇది

Update: 2017-01-03 10:35 GMT
టెక్నాల‌జీ దిగ్గ‌జం ఆపిల్ పై అనూహ్య‌మైన కేసు ఒక‌టి న‌మోదైంది. ఆపిల్ సంస్థ త‌మ ఐఫోన్ యూజ‌ర్ల‌కు అందించే ఫేస్‌ టైమ్ వీడియో చాట్ వ‌ల్లే యాక్సిడెంట్ జ‌రిగి త‌మ ఐదేళ్ల కూతురు చ‌నిపోయింద‌ని అమెరికాకు చెందిన దంప‌తులు ఆపిల్ సంస్థ‌పై కేసు వేశారు! 2014లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా జేమ్స్‌ - బెథానీ మాడిసెట్ దంప‌తులు త‌మ ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి టెక్సాస్‌లోని ఓ హైవేపై వెళ్తున్న‌పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వాళ్ల కారును హైవేపై పోలీసులు ఆపిన స‌మ‌యంలో వెన‌క నుంచి గంట‌ల‌కు 105 కిలోమీట‌ర్ల వేగంతో వ‌చ్చిన ఎస్‌ యూవీ ఒక‌టి ఢీకొట్టింది. గారెట్ విహెల్మ్ అనే వ్య‌క్తి ఆ కారును న‌డిపిస్తున్నాడు. ఈ ప్ర‌మాదంలో బెథానీ - ఆమె పెద్ద కూతురు చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా.. ఆమె చిన్న కూతురు చ‌నిపోయింది.

అయితే ఈ ప్ర‌మాదంలో ట్విస్ట్ ఏమిటంటే... ఆక్సిడెంట్ జ‌రిగిన స‌మ‌యంలో గారెట్ విహెల్మ్ ఐఫోన్‌ లోని ఫేస్‌ టైమ్‌ లో వీడియో చాట్ చేస్తున్న‌ట్లుగా తేలింది. దీంతో ఈ దంప‌తులు కొత్త కోణం తీసి ఆపిల్ పై కేసు వేశారు. డ్రైవింగ్ స‌మ‌యంలో త‌మ ఫోన్‌ను సుర‌క్షితంగా వాడేలా కంపెనీ త‌మ యూజ‌ర్ల‌ను హెచ్చ‌రించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని మాడిసెట్ దంప‌తులు కాలిఫోర్నియా సుపీరియ‌ర్ కోర్టులో కేసు వేశారు. ఫేస్‌ టైమ్‌ కు సుర‌క్షిత‌మైన, ప్ర‌త్యామ్నాయ డిజైన్‌ ను రూపొందించ‌డంలో విఫ‌ల‌మైన కార‌ణంగా త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ అలాంటి హెచ్చ‌రిక‌లు జారీ చేసి ఉంటే హైవే స్పీడులో యూజ‌ర్లు దానిని వాడ‌రు క‌దా అని వాళ్లు వాదిస్తున్నారు.

కాగా...ప్ర‌మాదానికి కార‌ణ‌మైన విహెల్మ్ కూడా తాను ఆ స‌మ‌యంలో ఫేస్‌ టైమ్ వాడుతున్న‌ట్లు పోలీసుల‌కు చెప్పాడు. ప్ర‌మాదం త‌ర్వాత కూడా అత‌ని ఫోన్‌ లో ఫేస్‌ టైమ్ యాక్టివ్‌ గానే ఉండ‌టాన్ని పోలీసులు గుర్తించారు. ఇలాంటి స‌మ‌యాల్లో ఆటోమెటిగ్గా ఫేస్‌ టైమ్ లాంటి యాప్స్ లాకౌట్ అయ్యేలా చేయాల‌ని, దానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక సామ‌ర్థ్యం ఉన్నా ఆపిల్ సంస్థ అలా చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని మాడిసెట్ దంప‌తులు కోర్టులో వాదిస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత అరెస్ట‌యిన విహెల్మ్ ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఫిబ్ర‌వ‌రి 27న ఈ కేసుపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌రి ఆపిల్‌ పై ఈ దంపతుల పోరాటం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. ఎలాంటి తీర్పు వ‌చ్చినా అది అనూహ్య‌మైన‌దేన‌ని న్యాయ నిపుణులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News