ఫ్యాక్షన్ మంట; కర్నూలు వణికిపోతోంది

Update: 2015-09-21 06:40 GMT
ఫ్యాక్షన్ ఖిల్లాలో పేరొందిన కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ పరి సమాప్తి అయినట్లు పలుమార్లు పోలీసు అధికారులు.. నేతలు చెబుతున్నా.. అదేమీ నిజం కాదన్న విషయం తరచూ నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. ఫేరుకు ఫ్యాక్షన్ అంతమైనట్లు చెబుతున్నా.. ఫ్యాక్షన్ మూలాలు మాత్రం పోలేదన్నది తాజా ఉదంతం మరోసారి రుజువు చేసింది.

కాంగ్రెస్ నేత కోట్ల వర్గానికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వర్గానికి మధ్య భారీ ఫ్యాక్షన్ ఉందన్న విషయం చాలామందికి తెలిసిందే. కర్నూలు జిల్లా రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నా.. వీరి వర్గాల మధ్య రాజకీయ కక్షలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నివురుగప్పిన నిప్పులా ఉండే ఫ్యాక్షన్ కక్షలు సోమవారం భగ్గుమన్నాయి.

మునిమడుగులో కేఈ వర్గానికి చెందిన నాసిర్ భాషా అనే వ్యక్తిని.. కోట్ల వర్గానికి చెందిన ఫ్యాక్షన్ కక్షల్లో రాళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో.. ఒక వర్గానికి చెందిన ఇళ్లను మరో వర్గానికి చెందిన వారు రాళ్లతో దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో పోలీసుల్ని తరలించి.. బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తమ వర్గానికి చెందిన వ్యక్తిని చంపేయటంపై కేఈ వర్గం ఒక్కసారి భగ్గుమనటమే కాదు.. ప్రతీకార హత్యలకు పాల్పడ్డారు. కోట్ల వర్గానికి చెందిన కంబస్వామి అనే వ్యక్తిని తలనరికేశారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పినా.. ప్రతీకారంతో రగిలిపోతున్న అధికారపక్షం.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి తల నరికేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. గంటల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలతో కర్నూలు జిల్లా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి.
Tags:    

Similar News