ప్ర‌గ‌తి నివేద‌న వెనుక కేసీఆర్ భారీ స్కెచ్!

Update: 2018-09-01 05:21 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేన్నీ ఊర‌కే చేయ‌రు. ఆయ‌న చెప్పే మాట‌.. చేసే ప‌ని వెనుక ల‌క్ష్యాలు వేరుగా ఉంటాయి. చూసేందుకు మామూలన్న‌ట్లుగా క‌నిపించే అంశాల వెనుక కేసీఆర్ మాస్ట‌ర్ మైండ్ లెక్క‌లు వేరుగా ఉంటాయ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. తాజాగా నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సు వెనుక అస‌లు ల‌క్ష్యం వేరుగా చెబుతున్నారు.

ప్ర‌గ‌తి నివేద‌న పేరుతో నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ అస‌లు ల‌క్ష్యం వేరన్న అభిప్రాయాన్ని పలువురు వ్య‌క్తం చేస్తున్నారు. అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఈ భారీ బ‌హిరంగ స‌భ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆశిస్తున్న‌ది వేర‌న్న అభిప్రాయం ఉంది.

ఈ భారీ స‌భ అస‌లు ల‌క్ష్యం ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార పార్టీకి మాంచి ఊపు తేవ‌ట‌మ‌న్న‌ట్లు క‌నిపిస్తున్నా.. అస‌లు ప్లాన్ మ‌రొక‌టి ఉంద‌ని తెలుస్తోంది. కేసీఆర్ అస‌లు ప్లాన్ అర్థం కావాలంటే.. ఆ మ‌ధ్య‌న జ‌రిగిన హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్క‌డో ఉన్న మంత్రి కేటీఆర్ ను హైద‌రాబాద్ కు తీసుకొచ్చి.. గ్రేట‌ర్ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పి.. త‌న‌కు బ‌దులుగా ప్ర‌చారం చేయాల‌ని చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అలా అని కొడుకును ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. కేవ‌లం కేటీఆర్ సామ‌ర్థ్యం ఎంత‌న్న విష‌యాన్ని పార్టీ వ‌ర్గాల‌కు.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

గ్రేట‌ర్ లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 99 కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకోవ‌టం ద్వారా.. ఎన్నిక‌ల్ని మేనేజ్ చేయ‌టంలో.. పోల్ మేనేజ్ మెంట్ లో కేటీఆర్ మొన‌గాడ‌న్న అభిప్రాయాన్ని క‌లిగించేలా చేయ‌టం తెలిసిందే. గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌ర బాధ్య‌త‌ను కేటీఆర్ భుజ‌స్కందాల మీద కేసీఆర్ వేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. హైద‌రాబాద్ ను అప్ప‌గించ‌టం అంటే.. స‌గం తెలంగాణ బాధ్య‌త‌ను కేటీఆర్ చేతికి ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. తాజాగా బ‌హిరంగ స‌భ విష‌యానికి వ‌స్తే.. త‌న రాజ‌కీయ వార‌సుడిగా కేటీఆర్ ను ప్ర‌మోట్ చేయ‌ట‌మే కేసీఆర్ అస‌లు ల‌క్ష్య‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇందుకోస‌మే ఈ భారీ బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన ప‌నుల నిర్వ‌హ‌ణ అంతా కేటీఆర్ చేతికి ఇవ్వటాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎంత‌కైనా కేసీఆర్ కుమారుడు.. రాజ‌కీయ వార‌సుడు. మ‌రి.. త‌న కొడుకు సామ‌ర్థ్యాన్ని.. స‌త్తాను చాటాలంటే.. అందుకు భారీ కార్య‌క్ర‌మం అవ‌స‌రం. అందులో భాగంగానే తాజా ప్ర‌గ‌తి నివేదన స‌ద‌స్సుగా చెబుతున్నారు. త‌న కొడుక్కి అప్ర‌క‌టిత ప‌ట్టాభిషేకాన్ని జరిపేందుకు వీలుగా తాజా స‌భ‌గా తెలుస్తోంది. మిగిలిన నేత‌ల మాదిరి తాను ప్ర‌మోట్ చేయాల్సిన అంశాన్ని బ‌య‌ట‌కు చెప్పేసి.. హ‌డావుడి చేయ‌టం కేసీఆర్ కు మొద‌ట్నించి అల‌వాటు ఉండ‌దు. అందుకు త‌న కుటుంబ స‌భ్యుల్ని పార్టీలోకి తీసుకొచ్చి.. వారు ఎదిగేలా ఎలా అయితే చేశారో.. త‌న రాజ‌కీయ వార‌సుడిగా.. త‌న త‌ర్వాత సీఎం ప‌ద‌వికి అన్ని అర్హ‌త‌లు ఉన్న నేత‌గా కేటీఆర్ ను ప్ర‌మోట్ చేయ‌ట‌మే తాజా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ అస‌లు లక్ష్యమ‌న్న మాట టీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారంగా చెబుతున్నారు. అంద‌రు అనుకున్న‌ట్లు చేస్తే.. ఆయ‌న కేసీఆర్ ఎందుక‌వుతారు?


Tags:    

Similar News