మా పిల్లల్ని ఫెయిల్ చేయండి

Update: 2015-06-27 10:52 GMT
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు మంచి మార్కులతో పాస్ కావాలని, ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించాలని, ఫస్ట్ ర్యాంకు రావాలని కోరుకుంటారు. కానీ హర్యానలోని తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఫెయిలవ్వాలని కోరుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా? వాళ్ల కోరికలో న్యాయం కూడా ఉంది మరి.ఫెయిలవ్వాలనే కోరుకోవడమే సరికాదంటే...అందులో న్యాయం ఉండటం ఏంటని ఆశ్చర్యపోకండి.

దేశవ్యాప్తంగా అమలవుతున్న విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులు వారి వయసుకు తగిన తరగతులు చదవాల్సిందే. ఈ క్రమంలో విద్యార్థులకు చదువు, సంబంధిత పాఠ్యాంశాలకు చెందని నైపుణ్యాలు అబ్బనప్పటికీ...పై తరగతులకు ప్రమోట్ చేసేస్తున్నారు. దీంతో పిల్లల తరగతులు పెరిగిపోవడం తప్ప వారి బుద్ధి మాత్రం వికసించడం లేదు. ఈ నేపథ్యంలో హర్యాన తల్లిదండ్రులు తమ పిల్లలకు నైపుణ్యాలు, సరైన విద్యా నేర్పాలని అలా కానిపక్షంలో తరగతుల్లో ఫెయిల్ చేయాలని కోరుతున్నారు. హర్యానాలోని దాదాపు 30,000 విద్యార్థులు తమ పిల్లలు ఫెయిల్ కావాలని కోరుతూ పాఠశాలకు వస్తున్నారని, ఉపాధ్యాయులకు విన్నవించుకుంటున్నారని ఇటీవల చేసిన ఓ సర్వేలో తేలింది.

హర్యానాలో మాధ్యమిక విద్య అభ్యసిస్తున్న 25,000,00 విద్యార్థుల్లో దాదాపు పదిహేను శాతం మంది విద్యార్థులుక సరైన సామర్థ్యాలు లేకున్నా పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారని ఈ సర్వేలో తేలింది. ఈ విషయంలో సదరు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టారియా, విద్యాశాఖ మంత్రి రాంవిలాస్ శర్మను కలిసి విన్నవించినా...ఫలితం లేదని సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. విద్యాహక్కు చట్టం వల్ల పరీక్ష రాయని విద్యార్థులు కూడా పై తరగతులకు వెళ్లిపోతున్నారని అన్నారు.

స్వచ్ఛంద సంస్థ నివేదిక బయటకు వచ్చి మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత హర్యాన సర్కారులో కదలిక మొదలయింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలు చాలా పెంచాల్సిన అవసరం ఉందని హర్యాన విద్యాశాఖ మంత్రి శర్మ అంగీకరించారు. దీంతో పాటు స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇదే క్రమంలో తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలల్లో ఉపాధ్యాయులను బాధ్యులుగా కూడా చేస్తామని ప్రకటించారు.
Tags:    

Similar News