సొంత ఇంటికి సరిచేసుకోలేకపోతే వైసీపీకి టీడీపీకి పట్టిన గతేనా..?

Update: 2022-09-27 09:19 GMT
ఒక్క చాన్స్ కనుక ఇస్తే ఇక ముప్పయేళ్ళ పాటు నేనే సీఎం అని జగన్ తన పాదయాత్ర సందర్భంగా తరచూ ప్రతీ చోటా చెప్పుకునేవారు. నాడు జగన్ కి వచ్చిన ఊపు కూడా అలాగే ఉండేది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న తరువాత ఏపీలో విపక్షాల గుండెలు జారిపోయాయి. వైసీపీ యాంటీ బ్యాచ్ సైతం జగన్ కనీసంగా రెండు టెర్ములు సీఎం కచ్చితంగా అవుతారు. ఏపీలో విపక్షం ఏమైనా చూసుకోవాలీ అంటే 2029 ఎన్నికల తరువాతనే అంటూ ఉండేవారు.

నాడు వైసీపీ ప్రభంజనం ఆ రేంజిలో ఉండేది. దాంతో అందరూ కూడా జగన్ అంతటి రాజకీయ  బలవంతుడు అనే భావించేవారు. వైసీపీ కూడా అత్యంత పటిష్టంగా ఉండేది. జగన్ జపమే పార్టీలో  అంతటా వినిపించేది. అయితే పాలనా పగ్గాలు అందుకున్న తరువాత జగన్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారు. తనదైన శైలిలో పాలన చేస్తూ వచ్చారు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో క్యాడర్ కి తొలి దెబ్బ తగిలింది.

ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ క్యాడర్ కి అత్యంత ప్రాధాన్యత ఉటూ వచ్చేది. వారే జనాల వద్దకు వెళ్ళి తాము ఫలానా పని చేయించామని చెప్పుకునేవారు. ప్రజలు కూడా వారిని ఆశ్రయించేవారు. కానీ వైసీపీ కొత్త విధానాల వల్ల క్యాండర్ ఆశలు అన్నీ కొట్టుకుపోయాయి. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారికి తీరని  అన్యాయం జరిగింది. కొందరికి తప్ప అందరికీ న్యాయం జరగలేదు. పార్టీని పదేళ్ల పాటు తన భుజాల మీద మోసి అన్నీ అరగదీసుకున్న క్యాడర్ వైసీపీకి దూరం అవుతూ వచ్చింది

ఇక తమ నియోజకవర్గాలలో కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులను చేరదీసి వారికి కాంట్రాక్ట్ పనులు ఇప్పించారు. తమ ప్రభుత్వమే కదా అని ఉత్సాహపడి కాంట్రాక్టు పనులు చేసిన వారికి అప్పుల తిప్పలు ఇపుడు మిగిలాయి తప్పించి డబ్బులు మాత్రం బిల్లుల రూపంలో రావడం లేదు అంటున్నారు. చాలా మంది పార్టీ క్యాడర్ ఇలా కాంట్రాక్టులు తీసుకుని పూర్తిగా ఖర్చు అయిపోయారు.

అప్పులు తెచ్చి కాంట్రాక్టులు చేసి తీరా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పేరుకుపోయి ఏమీ కట్టలేక మానసిక వ్యధతో మంచాలు పట్టేశారు. దాంతో పార్టీ క్యాడర్ ఈ దెబ్బకు ఇంకా దూరం అయిపోయింది. ఏకంగా సభలూ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కొందరు ఇదే విషయం వైసీపీ పెద్ద నాయకుల దృష్టిలో పడేలా చెబుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో బాగా అన్యాయం అయిపోతున్నారు పార్టీ క్యాడర్.

ఇపుడు చూస్తే ముచ్చటగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ నాలుగవ ఏట అడుగుపెట్టింది. అయితే ఈ మూడేళ్ళలో క్యాడర్ చేదుని మింగుతూ పడుతూ లేస్తూ అలా సాగుతోంది. ఎప్పటికైనా తమకు ముక్తీ మోక్షం ఉంటాయన్న ఆశతోనే  సాగుతోంది. కానీ వారు ఊహించినది ఏమీ జరగడంలేదు. కనీసం వారికి వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు కీలక నేతల నుంచి కూడా దగ్గరకు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు.

ఈ పరిణామంతో ఒక్కసారిగా క్యాడర్ స్తబ్దుగా మారిపోయింది. వారిలో వచ్చిన ఈ మార్పు వైసీపీకి రేపటి రాజకీయంలో కఠిన మైన తీర్పుగా మారుతుంది అని అంటున్నారు. క్యాడర్ ఇపుడు చాలా వ్యతిరేకంగా ఉంది అంటున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి యాభై మంది కీలకమైన నాయకులు క్యాడర్ తో మాట్లాడుతారు అని ఆ మధ్య అన్నా ఒకటి రెండు నియోజకవర్గాలతో ఆ కధ ఆగిపోయింది. దాంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి. ఎలా తమ బాధను చెప్పుకోవాలి ని క్యాడర్ సతమతమవుతోంది.

ఈ నేపధ్యంలో నుంచి చూస్తే పార్టీ పెద్దలు క్యాడర్ తో పనేంటి అనుకుంటున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. టీడీపీ కూడా గతంలో తమకు తిరుగులేదని భావించి  క్యాడర్ ని పట్టించుకోలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడింది. మరి టీడీపీ నుంచి గుణపాఠాలను వైసీపీ ఎంతమేరకు నేర్చుకుంది అన్నదే చర్చ.

ఆలాగే  ఇక్కడ దివంగత నేత వైఎస్సార్ మాటలను కూడా గుర్తు చేసుకోవాలి. అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొంటానని అన్నాడట అని ఒక పాత ముతక సామెతను చెబుతూ  వైఎస్సార్ ప్రత్యర్ధి పార్టీల మీద తరచూ సెటైర్లు వేసేవారు. అలా సొంత పార్టీని క్యాడర్ని చక్కదిద్దుకుని వారికి వైసీపీ పెద్దలు  న్యాయం చేయలేని నాడు బయట ఎంత అర్భాటం చేసినా కుదిరే పని కాదనే అంటున్నారు. ఒక విధంగా క్యాడర్ ని తక్కువ చేసినా చూసినా తగిన పరిహారం తప్పదనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News