డీటైల్డ్ గా పరామాన్నం బాబా స్కెచ్ ఇదే..

Update: 2016-06-17 17:46 GMT
లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డిని ట్రాప్ చేసి రూ.1.30కోట్లను దోచేసిన పరమాన్నం బాబా అసలు కథను పోలీసులు పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ దొంగబాబాను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా తానేసిన మొత్తం స్కెచ్ ను వారికి చెప్పటం.. ఆ విషయాల్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ సీపీ మహేందర్ రెడ్డి వివరంగా చెప్పుకొచ్చారు.

= లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డికి మోహన్ రెడ్డి అనే స్నేహితుడు ఉన్నాడు. ఇతడే శివ అలియాస్ పరమాన్నం బాబా గురించి గొప్పలు చెప్పి.. అతడికి అతీంద్ర శక్తులు ఉన్నట్లుగా చెబుతూ పరిచయం చేశారు. అతను డబ్బును డబుల్ చేయటంతో పాతో పాటు అత్యంత శక్తివంతమైన రైస్ బౌల్ కాయిన్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. గతంలో తనకు లక్ష రూపాయిల్ని డబుల్ చేసినట్లుగా నమ్మించాడు. దీంతో నమ్మిన మధుసూదన్ రెడ్డి దొంగస్వామిని బెంగళూరు నుంచి డబ్బుల్ని డబుల్ చేసే పూజ కోసం పిలిపించారు.

= బెంగళూరు నుంచి దొంగస్వామికి కారును ఏర్పాటు చేయటంతో పాటు.. హైదరాబాద్ ఓహ్రీస్ హోటల్ లో రూమ్ ను సిద్ధం చేయించారు. ఇదిలా ఉండగా మధుసూదన్ రెడ్డికి తెలీకుండా మరో ఇద్దరి (దామోదర్.. శ్రీనివాస్ రెడ్డి) ని కూడా పరమాన్నం బాబా సిద్ధం చేశారు. వారికి కూడా డబ్బును డబుల్ చేస్తానని చెప్పటంతో వారు రూ.1.75 లక్షలు తెచ్చి శివకు ఇచ్చారు. వారు కూడా ఓహ్రీస్ లోనే రూమ్ బుక్ చేసుకున్నారు.

= జూన్ 14న మధుసూదన్ రెడ్డితో కలిసి ఎంజే మార్కెట్లో పూజ సామాగ్రి కొన్న వారు.. తర్వాత ఇంటికి వెళ్లారు. ముందుగా పూజలో రూ1.5లక్షలు పెట్టించారు. దానికి బదులుగా దామోదర్.. శ్రీనివాస్ రెడ్డిలు ఇచ్చిన డబ్బు కలిసి రూ.3లక్షలు చూపించారు. దీంతో దొంగబాబా మాటల్ని మధుసూదన్ పూర్తిగా నమ్మారు. పెద్ద మొత్తంలో డబ్బు పెడితే అందుకు పెద్ద ఎత్తున డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్న మాటను నమ్మేశాడు.

= దీంతో అసలు కథ మొదలైంది. డబ్బులు డబుల్ అయ్యే పూజ కోసం రూ.1.30కోట్ల మొత్తాన్ని మధుసూదన్ రెడ్డి సిద్ధం చేశారు. ఆ తెచ్చిన మొత్తాన్ని పూజ మధ్యలో పూల మధ్యలో పెట్టారు. పూజ జరిగినా.. డబ్బులు డబుల్ కాలేదు. దీంతో.. దగ్గర్లోని గుడిలో పూజ చేయాల్సి ఉంటుందని నమ్మించాడు. తన ప్లాన్ లో భాగంగా ఉమ్మెత్త పూలు.. సీసం తదితరాల్ని ఉపయోగించి పరమాన్నం తయారు చేసి ప్రసాదం కింద ఇచ్చాడు. మధుసూదన్ ఆయన భార్యకు.. కొడుకు సందేశ్ రెడ్డికి పెట్టాడు.

= డబ్బును డబుల్ చేయటానికి గుడికి వెళ్లేందుకు సందేశ్ రెడ్డి ఒక్కడు చాలంటూ చెప్పటంతో మధుసూదన్ ఆయన సతీమణి ఇంటి వద్దే ఉండిపోయారు. ఇంటి నుంచి బయలుదేరిన పరమాన్నం బాబా.. మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డిని వెంట పెట్టుకొని గుడికి బయలు దేరారు. అయితే.. పూజ తర్వాత కాస్త హోటల్ లో పని ఉందంటూ ఓహ్రీస్ హోటల్ కు వెళ్లాడు. డబ్బు మూటను కారులోనే పెట్టి లాక్ చేసిన సందేశ్ రెడ్డి స్వామి రూమ్ కి వచ్చాడు. అక్కడ యోగా చేయాలంటూ సందేశ్ రెడ్డిని కోరాడు. యోగాలో భాగంగా ఇనుప వస్తువులు ఏమీ ఆయన వద్ద ఉంచుకోకూడదంటూ చెప్పిన మాటతో కారు తాళాలు బయటపెట్టి ధ్యానం చేయసాగాడు.

= పరమాన్నంలోని మత్తు ఎఫెక్ట్ తో మగతగా ఉన్న సందేశ్ రెడ్డిని ఏమార్చి కారులోని రూ.1.30కోట్ల సంచిని వేరే కారులోకి మార్చేశాడు. అనంతరం సందేశ్ రెడ్డి కారు తీసుకొని వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన సందేశ్ రెడ్డి కారులో ఉండాల్సిన డబ్బు లేకపోవటం.. ఇంట్లో తల్లిదండ్రులు స్పృహ లేకుండా ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

= మరోవైపు.. రూ.1.30కోట్లు నొక్కేసిన దొంగస్వామి హోటల్ రూమ్ ను ఖాళీ చేసేసి.. ట్యాక్సీలో బయటపడ్డాడు. జీవీకే మాల్ దగ్గర.. తనకు మొదట రూ.1.75లక్షలు ఇచ్చిన ఇద్దరికి రూ.12లక్షలు ఇచ్చాడు. అక్కడ నుంచి ఆటోలో బయలుదేరి బ్యాగులు కొని.. వాటిలో డబ్బు ప్యాకెట్లు ప్యాక్ చేసుకొని బెంగళూరుకు బస్సులో వెళ్లిపోయాడు. హోటల్లో ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్.. ఫోన్ నెంబరు సంభాషణలతో దొంగస్వామి ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల్ని డబుల్ చేసుకోవాలన్న పేరాశ ఇంత కథ జరిగేలా చేసింది.
Tags:    

Similar News