వీడే.. పూజ చేసి పరమాన్నం పెట్టి దోచే దొంగబాబా

Update: 2016-06-16 16:34 GMT
అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తున్న ఇతగాడే.. పరమాన్నం దొంగస్వామి. పూజల పేరుతో మాయమాటలు చెప్పేసి.. లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ కు ఆయన కుటుంబం దగ్గర రూ.1.30 కోట్లు దోచేసిన మాయగాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరమాన్నం బాబా గుట్టు రట్టైంది. ఇతగాడి హిస్టరీ మొత్తాన్ని బయటకు లాగిన పోలీసులు.. వీడు మామూలోడు కాదని.. పాత నేరస్తుడే అని తేల్చారు. పూజల పేరుతో మాయమాటలు చెప్పటం వీడికి అలవాటుగా చెబుతున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండటం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివనే.. పరమాన్నం బాబాగా తేల్చారు. గడిచిన రెండేళ్లలో దొంగబాబాగా మారి చాలామందిని మాయ చేసేసి భారీగా దోచుకున్నట్లుగా చెబుతున్నారు. లక్ష్మీదేవి పూజలంటూ రూ.63 లక్షల వరకూ కాజేసినట్లుగా చెబుతున్నారు. లక్ష రూపాయిలు ఇస్తే రెండు లక్షలు ఇస్తానంటూ ప్రజల్ని నమ్మించటం ఇతగాడికి అలవాటంట.

మరి.. ఇలాంటి కిలాడీ.. అంత పెద్ద లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ కు ఎలా తగిలాడో? వాస్తు దోషం.. ఇంట్లో శాంతి కోసం ప్రత్యేక పూజలు చేస్తానంటూ.. పూజలో భాగంగా ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకవస్త్రంలో కట్టించి.. ఆ తర్వాత తాను వండిన మత్తుమందుతో కూడిన పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టి.. గుళ్లో డబ్బు సంచి ఒక రోజు ఉంచాలంటూ బురిడీ కొట్టి జంప్ అయిన ఇతగాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు పెట్టిన మత్తుమందు (నిద్రమాత్రల్ని భారీగా వేసినట్లుగా గుర్తించారు) పరామన్నం దెబ్బకు లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో దొంగబాబా శివను 24 గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. దొంగబాబా ఉదంతం గురించిన సమాచారం అందిన వెంటనే.. అతని ఫోన్ ను ట్రాప్ చేసిన పోలీసులు దొంగబాబా ఎవరెవరితో మాట్లాడారన్న విషయాన్ని గుర్తించారు. అనంతరం వారిని తమదైన శైలిలో విచారించిన పోలీసులు పరామాన్నం బాబా ఎక్కడున్నాడో తెలుసుకున్నారు. బెంగళూరు శివారులో తల దాచుకున్నట్లు అర్థమైన పోలీసులు పక్కా ప్లాన్ తో అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భారీగా డబ్బు.. నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News